క్యాబ్ ఖర్చుతోనే గాల్లో ప్రయాణం.. ఎయిర్ ట్యాక్సీ మేడ్ ఇన్ గుంటూరు
ట్రాఫిక్.. ట్రాఫిక్.. ట్రాఫిక్.. రోడ్డు మీదికి వెళితే చాలు.. సుడిగుండంలో చిక్కుకున్నట్లే. ఎక్కడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ గోల మాత్రం తప్పదు. అరగంట ప్రయాణానికి ఆరు గంటలు పట్టిన దుస్థితిని వాహనదారులు ఫేస్ చేసి ఉంటారు. ఇక మన హైదరాబాద్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పీక్ టైమ్‌లో ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే వాళ్ల పని అవుటే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ బాధలు తప్పించేందుకు ఎయిర్ ట్యాక్సీలు తేవాలనే ఆలోచనలు పురుడుపోసుకున్నాయి. ఇప్పటికే ఫారెన్ కంట్రీస్‌లో ఈ ఎయిర్ టాక్సీలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఇవి మన దేశంలో కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.
ఇక, మన దేశంలో కూడా త్వరలో ఎయిర్ టాక్సీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి మన దేశంలోనే.. అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో జనాలు ఎయిర్ ట్యాక్సీ ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. అది కూడా మేడ్ ఇన్ ఆంధ్రా ఎయిర్ ట్యాక్సీల ద్వారా జామ్ జామ్ అని ఎగిరిపోయే రోజులు దగ్గరిలోనే ఉన్నాయి. ఎలాగైతే రోడ్డుమీద ఓ ఆటో లేదా ట్యాక్సీ ఎక్కుతోమో అలాగే ఎయిర్ ట్యాక్సీ ఎక్కి, గాలిలో ప్రయాణించే సదుపాయం రాబోతున్నది.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ రేసులో ఇప్పటి వరకు ముందు వరుసలో ఉన్నాయి. ఎయిర్ ట్యాక్సీ రేసులో గుంటూరుకు చెందిన ఓ యువకుడు దూసుకొస్తున్నాడు. ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాడు. మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థను ఏర్పాటు చేసి ప్రయోగాలు చేస్తున్నాడు. మోటర్లు మినహా మిగతా పరికరాలన్నీ మేడిన్ ఆంధ్రప్రదేశ్ కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.