
మణిపూర్‌లో రెండో ప్రపంచ యుద్ధపు జాడలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా థౌబాల్ జిల్లాలో 45 కిలోల బరువున్న ఆర్టిలరీ షెల్( భారీ తుపాకుల నుంచి కాల్చే పెద్ద బుల్లెట్ లేదా బాంబు) బయటపడింది. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా భూగర్భంలో పాతుకుపోయి ఉన్న ఈ బాంబును పోలీసులు సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఆగస్టు 28న థౌబాల్ జిల్లా ఖంగబోక్ పార్ట్–3 మఖా లీకై ప్రాంతంలో ఈ షెల్ బయటపడింది. హీరాక్ నది ఒడ్డుని తవ్వి తెచ్చిన మట్టిని ఇంటి పనుల కోసం ఉపయోగిస్తుండగా స్థానికులకు ఇది కనిపించింది. ఒక్కసారిగా బాంబు బయటపడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ప్రాంతాన్ని ముట్టడి చేసి, కేసు నమోదు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ షెల్‌ను లాంగథెల్ చింగోల్ ప్రాంతానికి తరలించి, నియంత్రిత పరిస్థితుల్లో పేల్చివేసింది. “ఇది చాలా శక్తివంతమైన షెల్. పేలిపోతే పెద్ద నష్టం జరిగేది. సమయానికి బయటపడటంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది,” అని ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ పోలీసు అధికారి తెలిపారు.
మణిపూర్‌లో తరచూ వెలుగులోకి వచ్చే ఇలాంటి యుద్ధపు శకలాలు, ఈ రాష్ట్రం రెండో ప్రపంచ యుద్ధం ఆసియా–పసిఫిక్ రంగంలో కేంద్ర బిందువుగా ఉన్న కాలాన్ని గుర్తు చేస్తాయి. 1944లో జరిగిన ఇంఫాల్ యుద్ధంలో జపాన్ దళాలు, ఇండియన్ నేషనల్ ఆర్మీ బలగాలు, మిత్ర దళాల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. అదే లోయల్లో ఇప్పుడు గ్రామాలు, ఇళ్లూ ఉన్నాయి.
“మణిపూర్ ఒక లివింగ్ మ్యూజియం ఆఫ్ వరల్డ్ వార్–II లాంటిది” అని ఇంఫాల్‌కి చెందిన చరిత్రకారుడు ఒకరు తెలిపారు. “ఆ సమయంలో ఇంఫాల్ లోయలో ఆకాశంలో విమాన పోరాటాలు, నేలపై తుపాకీ కాల్పులు, బాంబుల వర్షం అన్నీ జరిగాయి. అందుకే ఇప్పటికీ శకలాలు బయటపడుతూనే ఉంటాయి” అని ఆయన అన్నారు.
గత నెలలో కూడా ఇంఫాల్ వెస్ట్‌లో యుద్ధపు శకలాలు బయటపడ్డాయి. అక్కడ కార్మికులు తవ్వకాలు చేస్తుండగా అమ్యునిషన్ కేసులు, గ్రెనేడ్లు, ఇనుప వస్తువులు, నీటి సీసాలు, తుప్పు పట్టిన మెటల్ బాక్స్ కనిపించాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. “అనుమానాస్పదంగా కనిపించే ఇనుప వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. కనిపిస్తే గుర్తు పెట్టి అక్కడినుంచి దూరంగా వెళ్లి, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి” అని సూచించారు.