తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలందరూ తెల్లవారుజాము నుంచే తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసి ఇంటిల్లిపాది ఎంతో ఘనంగా జరుపుకున్నారు. చిన్న.. పెద్దా.. యువత పెద్ధ సంఖ్యలో పాల్గొని భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకున్నాయి. భోగి మంటల అనంతరం ప్రతి ఇంటి ముందు చూడచక్కని రంగవల్లులు ఆకట్టుకున్నాయి. రంగు రంగులతో ఆకాశ హరివిల్లును నేలపైకి తీసుకువచ్చినట్లుగా ఇళ్ల ముందు అందమైన ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఓ ఇంటి ముందు వేసిన చిన్న ముగ్గు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.ఆ ముగ్గులో మరో స్పెషాలిటీ ఏం లేదు. అందరు వేసే చిన్న భోగి రంగవల్లి మాత్రమే. కానీ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం ఆ ముగ్గు పక్కనే కనిపించిన ఆ పాట. ముగ్గు చూడాలి.. లేకపోతే అంటూ ఓ మహిళ రాసిన పాట తెగ ఫేమస్ అవుతుంది. ఆమె రాసింది మరేదో కొత్త పాట కాదండి.. ఇన్నాళ్లు నెట్టింటిని షేక్ చేసిన జారుమిఠాయా సాంగ్.. నమ్మకపోతే ఫోటో చూడండి.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జారు మిఠాయా సాంగ్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ నెట్టింట చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీల్స్.. మీమ్స్ అంటూ తెగ సందడి చేసింది. జంబలకిడి జారు మీఠాయా టకు పేరడీలు, సెటైర్లు, మీమ్స్, డీజీ మిక్స్‌లు ఓస్ ఒకటేంటి.. సోషల్ మీడియా అంతా ఈ పాటతో మోతమోగిపోయింది. ఆ పాట పాడి నెలలు గడుస్తున్నా.. ఆ పాట క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు.. ఏదో ఒక సందర్భానికి ఆ పాటను మిక్స్ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు నెటిజన్లు.
తాజాగా ఓ ఇంటి ముందు వేసిన ముగ్గు పక్కన ఈ పాటను తమదైన శైలిలో రాశారు. “నేను ముగ్గు వేసిన చూడు.. నేను ముగ్గు వేసిన చూడు.. నా ముగ్గు సై చూడకుంటే తీసేస్తా చూడు జంబిలకిడి జారు మిఠాయ” అంటూ పాటను రాశారు. దీంతో ఈ ముగ్గు వైపు కంటే వాళ్లు రాసిన పాటపై అందరి దృష్టి పడింది. దీంతో ఈ ముగ్గు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే ఇది ఎక్కడ వేశారనేది మాత్రం తెలియరాలేదు.