
కోహిమా, ఆగస్ట్ 27: నాగాలాండ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తుయెన్సాంగ్‌లోని జిల్లా రవాణా కార్యాలయం (DTO) భవనం కుప్పకూలింది. తుయెన్సాంగ్‌లోని పోస్ట్ ఆఫీస్ వార్డులో ఉన్న ఈ భవనం శనివారం ఉదయం నేలమట్టమైంది. భవనం కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. జిల్లా రవాణా కార్యాలయ భవనం గతంలోనే నిర్మాణపరంగా ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా భవనం కూలిపోయే ప్రమాదం ఉందని నిర్మాణ, సాంకేతిక నిపుణుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో తుయెన్సాంగ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) చైర్మన్ లిథ్రోంగ్లా టోంగ్పి రుట్సా ఈ ఏడాది జూలై 23న అత్యవసర కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో జూలై 24 నుంచి DTO కార్యాలయాన్ని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేశారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్, పన్నుల వసూలు, పర్మిట్లు తదితర మోటారు వాహన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. తుయెన్సాంగ్ జిల్లాలో ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉంది. కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడంతో జూలై 19 నుంచి ఇప్పటివరకు 49 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నాగాలాండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NSDMA) తెలిపింది. వీరిలో DTO భవనం దిగువ ప్రాంతంలో నివసించే 44 కుటుంబాలు, పోస్ట్ ఆఫీస్ వార్డు, బజార్-ఏ వార్డుకు చెందిన మరో ఐదు కుటుంబాలు ఉన్నారు. భద్రతాపరంగా ప్రమాదకరంగా ఉన్న రెండు భవనాలను ఇప్పటికే కూల్చివేశారు. DTO భవనాన్ని కూడా కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుండగా, కొండచరియల కారణంగా అది కుప్పకూలింది.
The DTO office building collapsed after being struck by a massive flash flood in the Nepal–Tibet area pic.twitter.com/P9Y1CVuGst
— Surajit (@surajit_ghosh2) August 27, 2026
DTO కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భూమి కుంగిపోవడం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 6 నుంచి 8 అంగుళాల మేర భూమి కుంగుతున్నట్లు అంచనా వేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకరంగా గుర్తించి ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భవనాన్ని ముందుగానే ఖాళీ చేయించడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర కూల్చివేత చర్యలను చేపట్టేందుకు PWD (Housing) ఆధ్వర్యంలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. కూల్చివేత, సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో ప్రజలు, అనధికార వ్యక్తులు ప్రమాద ప్రాంతంలోకి ప్రవేశించకుండా అధికారులు ఆంక్షలు విధించారు. కొండచరియలు, భూమి కుంగిపోవడంతో ఇళ్లను ఖాళీ చేసిన కుటుంబాల కోసం తుయెన్సాంగ్ టౌన్ హాల్‌లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రభావిత కుటుంబాలకు అత్యవసర సహాయ సామగ్రి, ఇతర అవసరమైన సహాయాన్ని అధికారులు అందిస్తున్నారు. నిరంతర వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.