ఎదురుగా వచ్చిన రైలు ప్రమాదం నుండి ఓ వ్యక్తి వెంట్రుక వాసిలో తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం కేరళలో చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు అతన్ని ఢీ కొట్టే సమయానికి అతడు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. రైలు అతనిపై నుంచి వెళ్లిపోయిన వెంటనే అతను ఎలాంటి చిన్నపాటి గాయం కూడా లేకుండా లేచి వెళ్ళడం చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. నీకు ఇంకా భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ గురూ..! అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
వైరల్‌గా మారిన ఈ షాకింగ్ సీన్ కేరళలోని కన్నూర్ జిల్లాలో వెలుగుచూసింది. కన్నూర్ సమీపంలో రైలు అతనిపై వేగంగా వెళుతుండగా అతడు పట్టాలపై పడుకుని ఉన్న ఫుటేజ్ ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. మంగళూరు-తిరువనంతపురం రైలు ఈ ప్రాంతం గుండా వెళుతుండగా కన్నూర్, చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని 56 ఏళ్ల పవిత్రన్‌గా గుర్తించారు.
వీడియో ఇక్కడ చూడండి..
పవిత్రన్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు రైల్వే పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పవిత్రన్ పట్టాలపై నడుచుకుంటూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, రైలు వస్తున్నట్లు గమనించలేదని పేర్కొన్నాడు. అతను ప్రమాదాన్ని గ్రహించినప్పుడు, వెంటనే తప్పించుకోవడానికి సమయం లేదు..దాంతో సెకండ్ వ్యవధిలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాడు. వెంటనే ఉన్నచోటే అతను పట్టాలపై నిలువునా పడుకుండిపోయాడు. రైలు అతనిపై నుండి వెళ్లిపోయింది. ఈ వీడియో చూసి తాము కూడా ఆశ్చర్యపోయామంటూ రైల్వే అధికారులు, పోలీసులు చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..