
భారతదేశంలో ప్రస్తుతం పని సంస్కృతి, ఒత్తిడి గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ఒక వైపు డిస్‌కనెక్ట్ హక్కు వంటి అంశాలపై కూడా చర్చ నడుస్తోంది. ఉద్యోగులు ఆఫీసు సమయం తర్వాత పనికి దూరంగా ఉండటానికి చట్టబద్ధమైన హక్కును కలిగి ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన రేఖ ఉండాలని ప్రజలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వైరల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో మరింత తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ ఫోటో దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరిలో ఆలోచనను రేకెత్తించింది. కొందరు దీనిని అపారమైన అంకితభావానికి నిదర్శనంగా అభివర్ణిస్తే, మరికొందరు దీనిని అధిక పని ఒత్తిడి, లోపభూయిష్ట పని విధానానికి సంకేతంగా ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పెళ్లి మండపంపై ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న వధువు
వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఒక యువతి పెళ్లి కూతురి గెటప్‌లో మండపంలో కూర్చుని ఉంది. పక్కనే వరుడు కూడా ఉన్నాడు. కానీ, వివాహ దుస్తుల్లో ఉన్న ఆ వధువు ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన క్షణాలలో ఒకటి. అలాంటి అపురూప క్షణంలో వివాహ వేదికపై కూడా పనిచేయడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.. పెళ్లి పీటలపై కూర్చుని కూడా పని చేయడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు.
ఆ వైరల్ పోస్ట్ కథ ఏంటంటే..
ఈ వైరల్ పోస్ట్ వెనుక కథ KoyalAI అనే స్టార్టప్ కంపెనీ CEO మెహుల్ అగర్వాల్ షేర్ చేశారు. మెహుల్ ఈ ఫోటోను X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశాడు. ఫోటోలోని వధువు తన సోదరి, KoyalAI సహ వ్యవస్థాపకురాలు కూడా అయిన గౌరీ అగర్వాల్ అని వెల్లడించాడు.
స్టార్టప్ జీవితాన్నిఎప్పుడూ గ్లామరస్ గా, రొమాంటిక్ గా ఉంటుందని ప్రజలు భావిస్తారని, కానీ, వాస్తవంగా చూస్తే వారి జీవితం ఇబ్బందులతో నిండి ఉంటుందని మెహుల్ తన పోస్ట్ లో రాశారు. వివాహ సమయంలో పెళ్లి తంతులోని ఒక భాగం ముగిసిన 10 నిమిషాల తర్వాత కంపెనీలో ఒక పెద్ద సాంకేతిక లోపం సంభవించిందని, దానిని వెంటనే పరిష్కరించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి, మండపంలో కూర్చుని గౌరీ తన ల్యాప్‌టాప్ తెరిచి సమస్యను పరిష్కరించాల్సి వచ్చిందని చెప్పారు.
People romanticize startups but it is a lot of work.
This is my sister & co-founder @gauri_al at her own wedding, 10 minutes after ceremony, fixing a critical bug at @KoyalAI.
Not a photo op, parents yelled at both of us.
When people ask why we won, I’ll point to this. pic.twitter.com/ee3wTEYwXG
— Mehul Agarwal (@meh_agarwal) December 16, 2025
సోషల్ మీడియాలో ప్రజల స్పందనలు
ఈ పోస్ట్ వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ప్రజల నుంచి స్పందనలు వెల్లువెత్తాయి. చాలా మంది వినియోగదారులు గౌరీ అంకితభావం, వృత్తిపరమైన బాధ్యతను ప్రశంసించారు. మరికొందరు వ్యవస్థాపకులు స్వయంగా కష్టపడి పనిచేసినప్పుడే స్టార్టప్ బలంగా మారగలదని వ్యాఖ్యానించారు. KoyalAI వంటి ఉత్పత్తి ఎందుకు అంత మంచిదో ఇప్పుడు వారికి అర్థమైందని ఒక వినియోగదారు రాశారు. మరోవైపు చాలా మంది ఆ ఇమేజ్‌ను విమర్శించారు. ఎంత ముఖ్యమైన పని అయినా, వివాహం వంటి కీలకమైన, వ్యక్తిగత సమయంలో పని చేయడం సరైనది కాదని అంటున్నారు. కొంతమంది వినియోగదారులు తమ కెరీర్‌ల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని, కానీ వారి వ్యక్తిగత ఆనందాన్ని పణంగా పెట్టవద్దని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..