Viral Video: వయసు పెరుగుతున్నా కొద్ది కొందరు నిస్సాహాయత ప్రదర్శిస్తుంటారు. కృష్ణా, రామా అంటూ ఇంటికే పరిమితం అయిపోతుంటారు. ఇంట్లోనే పిల్లలతో, పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే, ఈ బామ్మ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అంటోంది. తాను అందరిలాంటి మహిళను కాదు.. వెరీ స్పెషల్ పర్సన్ అంటోంది. అనటమే కాదు.. నిరూపించి చూపించింది కూడా. అవును.. కేరళకు చెందిన ఈ బామ్మ పేరు రాధామణి. అందరూ ఆమెను ముద్దుగా మణి అమ్మ అని పిలుచుకుంటారు. కాగా, ఆమె పేరులోనే ‘మణి’ అని ఉంది. ఆ పేరుకు తగ్గట్లే ఆమె అందరినీ ఆకట్టుకుంటోంది. 71 వయసులో 11 రకాల వాహనాల లైసెన్స్ పొంది అందరిచీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత వయసులో 11 రకాల వెహికిల్ లైసెన్స్ పొందిన ఏకైక మహిళగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు కారణం తన భర్తే అని గర్వంగా చెబుతోంది రాధామణి.
రాధామణి భర్త త్విలాల్.. 1978లో డ్రైవింగ్ స్కూల్‌ని ప్రారంభించాడు. ఈ స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి రాధామణి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టింది. అలా డ్రైవింగ్‌పై మక్కువ పెంచుకకుంది. ఆడవాళ్లు డ్రైవింగ్ చేయడం ఏంటని అవహేళన చేసే సమాజంలో.. ఏకంగా 11 రకాల వాహనాలను అవలీలగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బస్సు, లారీ, క్రేన్, ట్రైలర్, ఫోర్క్ లిఫ్ట్, రోడ్ రోలర్, జేసీబీ వంటి 11 రకాల వాహనాలను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంది. వాటికి సంబంధించి లైసెన్స్ కూడా పొందింది రాధామణి. అయితే, ఆమె భర్త త్విలాల్.. 2004లో చనిపోవడంతో.. కుటుంబ పోషణ కోసం డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలను తానే టేకోవర్ చేసింది. ఆ సమయంలో ఓ మహిళ హెవీ వెహికిల్ నడుపుతున్న తీరును చూసి జనాలు షాక్ అయ్యారు. కాగా, కేరళలలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా రాధామణి గుర్తింపు పొందింది.
రాధామణి ఎవరు?
రాధామణి కారెల్ కొచ్చిలోని తోప్పుంపాడి నివాసి. ఆమె తన 30 సంవత్సరాల వయస్సులో డ్రైవింగ్ ప్రారంభించింది. ఆమెకు డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించిన భర్త త్విలాల్.. ఆమెకు వాహనాలను నడపడం నేర్పించాడు. ఇప్పుడు ఆమె వయసు 71 సంవత్సరాలు. వృద్ధురాలు అయిన రాధామణి.. తన ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనవడితో కలిసి తన భర్త డ్రైవింగ్ స్కూల్‌ను నడుపుతోంది. అయితే, ఇప్పుడామె డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం లేదు. కంప్యూటర్ కార్యకలాపాలను మాత్రమే చూసుకుంటోంది.
ఇక రాధామణి డ్రైవింగ్ స్కూల్‌లో ఉద్యోగంతో పాటు, ఎర్నాకులం జిల్లాలోని కలంసేరి పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సును కూడా అభ్యసిస్తోంది. ఈ వయస్సులో రాధామణి ఇప్పటికీ కొత్త విషయాలు నేర్చుకుంటూ బిజీగా ఉంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. టవర్ క్రేన్‌ను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవడానికే ఈ కోర్స్ చేస్తున్నట్లు ఆమె తన ఆసక్తిని వ్యక్తపరిచింది. మొత్తానికి రాధామణి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
Also read: