
ప్రస్తుత యాంత్రిక జీవనంలో మనిషి కడుపుల సల్ల కదలకుండా కూర్చున్న చోట నుంచి అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇంటి పని, వంట పని అంతా యంత్రాలే చేసి పెడుతున్నాయి. ఈ క్రమంలో వర్కవుట్లు, ఎక్సర్‌సైజ్‌లు అంటూ మళ్లీ యంత్రాలనే ఆశ్రయిస్తున్నారు. పూర్వం ఇలా ఉండేది కాదు. ఏ పనయినా ఒళ్లును వంచాల్సిందే. తద్వారా మనకు తెలియకుండానే కవాల్సినంత వ్యాయామం జరిగిపోయేది. అందుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతమంది యువతులు కలిసి చేసిన ఈ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది.
ఇంటి పనుల్లో దాగి ఉన్న ఆరోగ్యాన్ని ఈ వీడియో చూపిస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన పనులు మనం చేసుకుంటే చాలు ఇక ఏ వర్కవుట్లు అక్కరలేదని ఈ వీడియో ఓ సందేశం ఇస్తుంది.
వైరల్ వీడియోలో కొంత మంది అమ్మాయిలు విలేజ్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించి పనులు చేస్తుండటం కనిపిస్తుంది. వీడియో ప్రారంభంలో యోగా మ్యాట్ల మీద కూర్చుని పాలు పిండుతున్నట్లు యాక్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత బట్టలు ఉతుకుతున్నట్లు, బావి నుంచి నీళ్లు తోడుతున్నట్లు, తల మీద బిందెతో నీళ్లు ఎత్తుకొస్తున్నట్లు, రోటిలో దంచుతున్నట్లు, కట్టెల పొయ్యి మండించి గొట్టంతో ఊదుతున్నట్లు, చేతుల మీద రొట్టెలు చేస్తున్నట్లు ఇలా రకరకాల పనులను తమ యాక్టింగ్ ద్వారా చేపించారు.
ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఇంటి పనులను వ్యాయామంలా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కడం, నేల తుడవడం, తోటపని వంటి పనులతో కండరాలను బలోపేతం చేసుకోవచ్చు. గుండెకు మంచిది, ఒత్తిడి తగ్గిస్తుంది, బరువు తగ్గడంలో సాయపడుతుంది. ఇంటి పనులు చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది, జిమ్ ఖర్చు ఉండదు, సౌకర్యవంతంగా ఉంటుంది, కాబట్టి రోజువారీ పనులను చురుకుగా చేయడం ద్వారా ఫిట్‌గా ఉండవచ్చనేది నిపుణులు సూచన. నేల తుడవడం, బట్టలు ఉతకడం వంటివి చేసేటప్పుడు శరీరం వేగంగా కదలుతుంది. లిఫ్ట్ కోసం చూడకుండా మెట్లు ఎక్కి, దిగడం వల్ల కాలి కండరాలను బలోపేతం చేస్తుంది. మొక్కలకు నీళ్లు పోయడం, కలుపు తీయడం, మట్టి తవ్వడం వంటివి మంచి వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. .