భువనేశ్వర్, డిసెంబర్ 17: కొందరికి భక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ దేవుడి ఫొటో, విగ్రహం కనిపించినా.. అక్కడ వాలిపోయి భక్తిశ్రద్ధలతో ప్రార్ధనలు చేస్తుంటారు. సాధారణంగా ఏ గుడికెళ్లినా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. కానీ మనుషుల మాదిరి జంతువులు కూడా దేవుళ్లను ఆరాదించడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియో ఇది. ఈ వీడియోలో ఓ కోడి జగన్నాథ స్వామి విగ్రహం ముందు వంగి, కళ్లు మూసుకుని ప్రార్ధనలు చేయడం కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒడిశాలోని జగన్నాథుడ్ని దేవాలయం చాలా ఫేమస్. ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు అక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా అక్కడ ఓ వింత సంఘటన జరిగింది. వీడియో ఫుటేజీలో ఒకచోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం ఉండటం కనిపిస్తుంది. అక్కడి ఒక కోడి వచ్చింది. అది జగన్నాథ స్వామి విగ్రహం ముందు కామ్‌గా నిలబడి తలను నేలకేసి వంచి, కళ్లుమూసి వంగి ప్రార్థించడం వీడియోలో చూడొచ్చు. అలా దాదాపు కొన్ని సెకన్లపాటు అలాగే మనుషుల మాదిరి కళ్లు మూసుకుని మనసులో స్మరించడం వీడియోలో చూడొచ్చు. భగవంతుని ముందు ప్రార్ధిస్తూ జగన్నాథ స్వామి ఆశీస్సులు కోరుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ వీడియో క్లిప్‌ను ‘జగన్నాథ్ ధామ్ పూరి ఎక్స్‌పర్ట్’ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో జగన్నాథుడి భక్తులు ఈ దృశ్యం చూసి పరవశించిపోతున్నారు. వారంతా ఆ కోడి భక్తికి ముగ్ధులయ్యారు. ‘విశ్వమంతా ఆయన ముందు తల వంచాలి. ఎందుకంటే ఆయనే విశ్వ సృష్టికర్త’ అని, ‘ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. నారాయణుడు ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదు’ అని పలువరు కామెంట్లు పెడుతున్నారు.