
స్నేహానికి మించినది ఈ లోకంలో మరొకటి లేదు అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ, మనుషులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి రెండు మూగజీవాలు. సాధారణంగా పిల్లికి, కుక్కకు అస్సలు పడదు. పిల్లి కనిపిస్తే చాలు కుక్క వేటాడటానికి సిద్ధమవుతుంది. కానీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని వెంగళరావు కాలనీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అక్కడ ఒక పెంపుడు పిల్లి, పెంపుడు కుక్క ఒకే తల్లి బిడ్డల్లా, ప్రాణ స్నేహితుల్లా కలిసి తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
స్థానిక వెంగళరావు కాలనీలో నివసించే లక్ష్మి అనే యజమానురాలి ఇంట్లో ఈ అపురూప దృశ్యం నెలకొంది. ఆమెకు ముగ్గురు కుమారులు కాగా, వారంతా పెళ్ళిళ్లు చేసుకుని పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. పెద్ద కుమారుడి ఇంట్లో డాలీ అనే పెంపుడు కుక్క ఉంటే, చిన్న కుమారుడి ఇంట్లో లియో అనే పిల్లి ఉంటుంది. ఈ రెండూ కూడా ఆడ జంతువులే కావడం విశేషం. ఇవి వేర్వేరు ఇళ్లలో ఉంటున్నప్పటికీ, ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో నిత్యం కలిసిమెలిసి కాలక్షేపం చేస్తుంటాయి.
ఈ రోజుల్లో ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నదమ్ములు ఆస్తి గొడవలతో కోర్టుల మెట్లు ఎక్కుతుంటే, సహజ సిద్ధమైన జాతి వైరం ఉన్న ఈ రెండు మూగజీవాలు మాత్రం క్షణం కూడా విడిపోకుండా కలిసి ఉంటున్నాయి. డాలీ లేకుండా లియో, అలాగే లియో లేకుండా డాలీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయవు. నిత్యం పక్కపక్కనే తిరుగుతూ, సరదాగా ఆడుకుంటూ ఇవి చేసే అల్లరి చూస్తే కాలనీ వాసులకు భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఈ మూగజీవాల అద్భుతమైన ఫ్రెండ్‌షిప్‌ను చూడటానికి చుట్టుపక్కల ప్రజలు కూడా ఆసక్తిగా వచ్చి వెళ్తుంటారు. జాతులు వేరైనా, వైరం ఉన్నా.. ప్రేమ ముందు అవేవీ నిలవవని లియో-డాలీ నిరూపిస్తున్నాయి. ఈ మూగజీవాల సందడి చూసిన ప్రతి ఒక్కరూ ఔరా! స్నేహమంటే వీరిదే కదా అనకుండా ఉండలేకపోతున్నారు.