
డ్యూటీకి ఆలస్యంగా రావడానికి ఒక కానిస్టేబుల్ చెప్పిన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య రాత్రిపూట కలలో కనిపించడం వల్లే తాను సరిగ్గా నిద్రపోలేకపోతున్నానని, అందుకే పనికి ఆలస్యంగా వెళ్తున్నానని ఓ కానిస్టేబుల్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దర్యాప్తునకు ఆదేశించినట్లు 44వ బెటాలియన్ పిఎసి కమాండెంట్ సచింద్ర పటేల్ బుధవారం తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూపీకి చెందిన ఒక కానిస్టేబుల్ ప్రతిరోజూ డ్యూటీకి లేట్‌గా వస్తుండటంతో అతనిపై ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బెటాలియన్ ఇన్‌చార్జ్ దల్నాయక్ మధుసూదన్ శర్మ వెల్లడించిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 16న ఉదయం బ్రీఫింగ్‌కు కానిస్టేబుల్ ఆలస్యంగా వచ్చాడనీ, సరిగ్గా దుస్తులు ధరించలేదని, యూనిట్ కార్యకలాపాలకు తరచుగా హాజరు కాలేదని, ఇది తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించబడిందని నోటీసులో ఆరోపించారు. దీనికి స్పందించిన కానిస్టేబుల్, ఎవరూ ఊహించని విధంగా స్పందించారు.
తనకు, తన భార్యకు రాత్రిపూట గొడవలు జరుగుతాయని, దాని వల్లే తాను నిద్రపోలేకపోతున్నామని చెప్పాడు. తన భార్యతో తనకు తీవ్రమైన వాదన జరిగిందని, కలలో ఆమె తన ఛాతీపై కూర్చుని తనను చంపాలనే ఉద్దేశ్యంతో తన రక్తం తాగడానికి ప్రయత్నిస్తోందని అతను చెప్పాడు. రక్తం తాగే భార్య వల్లే తనకు నిద్రరావట్లేదని చెప్పాడు. దాని వల్ల తనకు నిద్రలేమి, ఆందోళన కలుగుతోందని, నిరాశకు గురవుతున్నానని కానిస్టేబుల్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.. దీనికోసం తాను మందులు కూడా తీసుకుంటున్నానని వివరించాడు.
అంతేకాదు.. తన తల్లి కూడా నరాల రుగ్మతతో బాధపడుతుందని, దీనివల్ల తన బాధ మరింత పెరిగిందని అతను చెప్పాడు. తనకు జీవించాలనే కోరిక పోయిందని, దేవుని పాదాల చెంతకు చేరిపోవాలని కోరుకుంటున్నాను అని భావోద్వేగంతో, విజ్ఞప్తితో కానిస్టేబుల్ తన ప్రతిస్పందనను తెలియజేశాడు. సోషల్ మీడియాలో లేఖ ప్రచురణపై దర్యాప్తు చేస్తున్నామని 44వ బెటాలియన్ PAC కమాండెంట్ సత్యేంద్ర పటేల్ తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..