
పామును కరిచి వ్యక్తి మృతి అనే వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా పాము మనిషిని కరిచినందుకు ఆ పాము చనిపోవాల్సింది వచ్చిందనే వార్త మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, మనిషిని కరిచి పాము ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయ్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక వింత, షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడిని నాగుపాము కరిచింది. అతడు పొలంలో వరి కోత పనులు చేస్తుండగా, హఠాత్తుగా నాగుపాము అతన్ని కాటేసింది. మూడు నుండి నాలుగు అడుగుల పొడవున్న ఆ నాగుపాము అతని కాలు చుట్టూ చుట్టుకుని ఉండటం చూసి, అతను వెంటనే దానిపై దాడి చేశాడు. నాగుపాముని పట్టుకుని దాని పడగను కరకరా కొరికి నమిలేశాడు. ఆ తరువాత తన చుట్టూ ఉన్న వాళ్లతో తనను పాము కరిచిందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు, తోటి కూలీలు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం అతను పూర్తిగా కోలుకున్నాడు. ఆ మరుసటి రోజు అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సంఘటన గ్రామస్తులను మాత్రమే కాకుండా వైద్యులను కూడా షాక్‌కు గురిచేసింది.
ఇది చాలా ప్రమాదకర సంఘటనగా వైద్యులు చెబుతున్నారు. పాము విషం ఆ యువకుడి నోటిలోకి వెళ్లి ఉంటే లేదా పాము యువకుడి నోటిలో కాటు వేసి ఉంటే, అతని ప్రాణాలను కాపాడటం కష్టమయ్యేదని చెప్పారు. కేవలం ఒక రాత్రిలో ఆ యువకుడు పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. యువకుడు కాటు వేసిన తోక ఉన్న పాము మాత్రం అక్కడే మరణించింది. ప్రస్తుతం, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..