బ్రిటన్‌లో 20 ఏళ్ల విద్యార్థిని హఠాత్తుగా బిడ్డకు జన్మనిచ్చింది. కడుపు నొప్పి వచ్చిందని టాయిలెట్‌కు వెళ్తే.. తనకు తెలియకుండానే పురుడుపోసుకుంది. తాను ప్రెగ్నెంట్ ఎలా అయ్యానో అన్న విషయాన్ని కూడా ఆమె గ్రహించలేకపోయింది. నెలసరి సరిగా లేకపోవడం వల్లే కడుపు నొప్పి వచ్చి ఉంటుందని భావించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై ఇండిపెండెంట్ పత్రిక ఓ కథనాన్ని రాసింది.
బ్రిస్టల్‌కు చెందిన డేవిస్ అనే అమ్మాయి సౌతాంప్టన్ వర్సిటీలో రెండవ సంవత్సరం హిస్టరీ, పొలిటిక్స్ చదువుతోంది. తనకు ఎప్పుడూ ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపిచంలేదని ఆమె చెప్పింది. బేబీ బంప్ కూడా లేనట్లు వెల్లడించింది. కానీ నెలసరి ఎప్పుడూ సరిగా లేదని, క్రమం తప్పుతూ ఉండేదని చెప్పింది. జూన్ 11న ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లాడు 3 కేజీల బరువున్నాడు. వాడు పుట్టినప్పుడు నా జీవితంలో నాకు అదే పెద్ద షాక్ అని ఆమె తెలిపింది.
కడుపు నొప్పి తీవ్రంగా వచ్చినప్పుడు నడవలేకపోయానని, మంచంపై పడుకోలేకపోయినట్లు తెలిపింది. నిజానికి తర్వాత రోజు నా పుట్టిన రోజు ఉంది, ఆ రాత్రి పార్టీకి నేను రెడీ అవుతున్నా, కానీ ఆ నొప్పి నన్ను నిద్రపోనివ్వలేదని ఆ అమ్మాయి చెప్పింది. అర్జెంట్‌గా టాయిలెట్‌కు వెళ్లాలని అనిపించిందని, కూర్చుని పుష్ చేశానని, కానీ తానప్పుడు పిల్లోడికి జన్మనివ్వబోతున్నట్లు తెలియదని చెప్పింది. పిల్లాడి అరుపు విన్న ఆమె అప్పుడు తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసింది. ఆ ఫ్రెండ్ అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. ఆ తర్వాత డేవిస్‌ను ప్రిన్సెస్ అన్నే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. 35 వారాల గర్భంతో ఉన్నప్పుడు డేవిస్ కుమారుడికి జన్మనిచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం తల్లీపిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు.