Baba Vanga: బాబా వంగా చెప్పిందే నిజమవుతుందా..? ఏలియన్స్ సీక్రెట్ ఫైళ్ల గుట్టు విప్పనున్న ట్రంప్..
దశాబ్దాలుగా చీకటి గదుల్లో, రహస్య ఫైళ్లలో బంధీ అయిన గ్రహాంతరవాసుల గుట్టును రట్టు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఏలియన్స్ నిజమేనా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే కొన్ని వేల పేజీల రహస్య పత్రాలను ప్రపంచం ముందు పెట్టాలని ఆయన పెంటగాన్‌ను ఆదేశించడంతో బాబా వంగా చెప్పిందే నిజమవుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.

2026 సంవత్సరం మానవ చరిత్రలో ఒక సంచలనం నమోదు కానుందా..? మనం ఈ అనంత విశ్వంలో ఒంటరివాళ్లం కాదని నిరూపితం కానుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. UFO, UAP లకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని ట్రంప్ పెంటగాన్‌ను ఆదేశించడంతో దశాబ్దాలుగా దాగి ఉన్న గ్రహాంతరవాసుల మిస్టరీ వీడే సమయం దగ్గరపడిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
నిజం బయట పెట్టాల్సిందే.. ట్రంప్ ఆదేశం
డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గ్రహాంతర జీవుల గురించి ప్రజల్లో ఉన్న విపరీతమైన ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని ఫైళ్లను విడుదల చేయాలని రక్షణ శాఖను ఆదేశించాను అని ఆయన తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏలియన్స్ ఉనికిపై చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. త్వరలోనే ట్రంప్ ఈ విషయంపై ఒక ప్రెస్ మీట్ నిర్వహించి, దాగి ఉన్న నిజాన్ని ప్రపంచానికి వెల్లడించే అవకాశం ఉంది.
బాబా వంగా 2026 జోస్యం
అమెరికాలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో బాల్కన్ల నోస్ట్రాడమస్‌గా పేరుగాంచిన బాబా వంగా 2026 గురించి చెప్పిన అంచనాలు ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. చూపు లేకపోయినా తన అతీంద్రియ శక్తులతో 9/11 దాడులు, సోవియట్ యూనియన్ పతనం వంటివి ఊహించిన ఆమె.. 2026 గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు.
ఏలియన్స్ రాక
2026 నవంబర్ నాటికి ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని, దీని ద్వారా గ్రహాంతరవాసుల ఉనికికి తిరుగులేని ఆధారాలు లభిస్తాయని ఆమె అంచనా వేశారు. 2026 నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ నియంత్రణను దాటి స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభిస్తుందని ఆమె వెల్లడించారు.
నమ్మాలా? వద్దా?
బాబా వంగా అంచనాలకు ఎటువంటి రికార్డులు లేవు. ఆమె మేనకోడలు, అనుచరులు చెప్పిన కథనాల ఆధారంగానే ఇవి ప్రచారంలో ఉన్నాయి. విమర్శకులు వీటిని కేవలం ఊహాగానాలుగా కొట్టిపారేస్తున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం అధికారికంగా UFO ఫైళ్లను తెరుస్తుండటంతో సామాన్య ప్రజల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది.
