ప్రపంచ వ్యాప్తంగా ఏవేవో ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. వాటిలో కొన్ని తెరపైకి వచ్చి తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనలను మనం అస్సలు నమ్మలేం.. ఎందుకంటే వాటిని అస్సలు అంచనా వేయలేం.. తాజాగా.. ఇటలీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. దీన్ని చదివితే మీరు కూడా ఆశ్చర్యపోయి.. ఎవర్రా మీరంతా అని అనడం ఖాయం.. వివరాల్లోకి వెళితే.. ఏదైనా కొత్త ప్రాంతాలకు వెళ్లినా.. ఎక్కడికైనా ప్రయాణం చేసినా.. ఈ ప్రయాణంలో ఆహారానికి అందరూ ప్రాధాన్యతనిస్తారు. అల్పాహారం ఎక్కడ బాగుంటుంది.. దారిలో ఏం దొరుకుతుంది..? భోజనం కోసం ఎక్కడికి వెళ్లాలి.. అనేదానిని ప్లాన్ చేస్తారు. మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండాలంటే బడ్జెట్‌కు అనుగుణంగా వ్యవహరించాలి. అయితే, కొన్నిసార్లు భోజనం మనం ఖర్చు చేయాలనుకున్న దానికంటే ఎక్కువగా అవుతుంది.. కొన్ని సార్లు తక్కువ కూడా కావొచ్చు.. కానీ.. ఇక్కడ ఓ హోటల్ కు వెళితే.. పర్యాటకుడికి తడిసిమోపెడయ్యింది.. ఎందుకో తెలుసా..? జస్ట్ తాను కొనుక్కున్న శాండ్‌విచ్‌ని రెండుగా కట్ చేయమని చెప్పినందుకు.. ఇటలీలోని ఒక పర్యాటకుడు తన శాండ్‌విచ్‌ని సగానికి కట్ చేయమని వెయిటర్‌ని అడిగినందుకు రెండు యూరోలు బిల్ వేయడంతో అతను షాక్ అయ్యాడు. ఇటలీలోని లేక్ కోమో సమీపంలోని గెరా లాయోలోని బార్ పేస్ అనే రెస్టారెంట్‌లో జూన్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. అజ్ఞాత సందర్శకుడు ప్రముఖ వెబ్‌సైట్ ట్రిప్అడ్వైజర్ సమీక్ష విభాగంలో తన రెస్టారెంట్ అనుభవాన్ని వెల్లడించాడు. దానికి ఒక స్టార్ రేటింగ్ కూడా ఇచ్చినట్లు పలు మీడియా ఛానెల్‌లు నివేదించాయి.
ఇండిపెండెంట్ ప్రకారం.. అతను ట్రిప్ అడ్వైజర్‌లో ‘డివిసో ఎ మెటా’ లేదా శాండ్‌విచ్‌ని కట్ చేయమన్నందుకు రెండు యూరోలు (సుమారు రూ. 180) బిల్లు వేశారంటూ.. రసీదుని అప్‌లోడ్ చేశాడు. తన స్నేహితుడితో కలిసి శాండ్‌విచ్‌ను తినాలనుకుని.. దానిని సగానికి కట్ చేయమని వెయిటర్ ను కోరాడు. ఇది శాండ్‌విచ్, కోకా కోలా, ఎస్ప్రెస్సో కాఫీకి సంబంధించిన ఇతర ఛార్జీలకు అదనం అని ట్రిప్ అడ్వైజర్‌లోని సమీక్షలో రాశాడు.
అయితే, శాండ్‌విచ్‌ను కట్ చేసినందుకు విధించిన అదనపు ఛార్జీని రెస్టారెంట్ యజమాని సమర్థించారని నివేదికలు సూచించాయి. “అదనపు అభ్యర్థనలకు ఖర్చు ఉంటుంది. మేము ఒకటికి బదులుగా రెండు ప్లేట్‌లను ఉపయోగించాల్సి వచ్చింది.. వాటిని కడగడానికి సమయం రెట్టింపు అవుతుంది.. ఆపై రెండు ప్లేస్‌మాట్‌లు. ఇది సాధారణ కాల్చిన శాండ్‌విచ్ కాదు, లోపల ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి.. దీన్ని రెండుగా కట్ చేయడానికి మాకు సమయం పట్టింది” అని యజమాని క్రిస్టినా బియాచీ ఇటాలియన్ దినపత్రిక లా రిపబ్లికాకు చెప్పారు. కస్టమర్ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేసి, ఆపై వారు ఛార్జీని తీసివేసేవారని ఆమె అన్నారు.
కాగా.. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి అనుభవాలు తమకెప్పుడూ జరగలేదంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..