పల్లెటూరిలో ఉండే ఇళ్లు… పెద్ద పెద్ద గదులు, విశాలమైన పెరడు, ఇంటి ముందు ఖాళీ స్థలం, ఎన్నో రకాల చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ నగరాల్లో మాత్రం సీన్ రివర్స్.. అలాంటి ఇళ్లను చూడలేం. ఎందుకంటే పెరుగుతున్న జనాభా రిత్యా ఫ్లాట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న స్థలాల్లో కూడా ఇళ్ళు నిర్మించి అద్దెకి ఇచ్చేస్తుంటారు.
ఇది ఇలా ఉండగా ఢిల్లీలోని బురాడీ ప్రాంతంలో ఉండే ఒకాయన మాత్రం కేవలం 6 గజాల్లోనే ఇల్లు నిర్మించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ‘బొమ్మ’ ఇల్లు మాత్రం కాదండోయ్.. అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న నిజమైన భవనం. పెరుగుతున్న జనాభా.. దానికి తగ్గట్టుగా ఆకాశాన్ని అందుకుంటున్న స్థలాల రేట్లతో విసిగిపోయిన ఈయన.. తనకున్న ఆరు గజాల స్థలంలోనే ఆరేళ్ళ క్రిందట ఏకంగా మూడు అంతస్థుల అందమైన భవనాన్ని కట్టిపడేశాడు.
ఇక ఈ భవనంలో కుటుంబాలు నివసించే విధంగా వసతులు ఉన్నాయి. కిచెన్, హాలు, బాత్ రూం, బెడ్ రూం ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా 4 కుటుంబాలు కూడా అందులో నివాసం ఉంటున్నాయి. నెలకు రూ.3,500 అద్దె కూడా కడుతున్నారు.