
ప్రపంచ భూగోళశాస్త్రంలో ప్రతీ దేశానికి నిర్దిష్టమైన సరిహద్దులు, ప్రాంతాలు ఉంటాయి. కానీ, ఒకే భూభాగం సంవత్సరంలో సగం రోజులు ఒక దేశంలో, మిగిలిన సగం రోజులు మరొక దేశంలో ఉంటుందని వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఐరోపా ఖండంలోని స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఫెసెంట్ ఐలాండ్ అనే చిన్న ద్వీపం ఈ వింతకు కేంద్ర బిందువు.
బిడాసోవా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం సంయుక్త పాలన కింద పనిచేస్తుంది. కాలెండర్ ప్రకారం..ఫిబ్రవరి 1 నుండి జూలై 31 వరకు, ఈ ఆరు నెలల కాలం పాటు ఫెసెంట్ ఐలాండ్ స్పెయిన్ దేశ అధికార పరిధిలోకి వస్తుంది. ఆగస్టు 1 నుండి జనవరి 31 వరకు తర్వాతి ఆరు నెలల కాలంలో ఈ ద్వీపం ఫ్రాన్స్ దేశ పాలనలోకి మారుతుంది. ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా రెండు దేశాల మధ్య శాంతియుతంగా పంచుకోబడుతున్న ఏకైక ప్రాంతంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ వినూత్న వ్యవస్థ వెనుక 350 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ చరిత్ర ఉంది. 1659లో స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన ముప్పై ఏళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రీటీ ఆఫ్ ది పిరినీస్ అనే శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఫెసెంట్ ఐలాండ్‌లోనే సంతకాలు చేశారు. నాటి నుంచి రెండు దేశాల మధ్య మైత్రికి చిహ్నంగా ఈ ద్వీపాన్ని చెరో ఆరు నెలలు పంచుకోవాలని నిర్ణయించారు.
దాదాపు 200 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ చిన్న దీవిలో సాధారణ పౌరులు లేదా పర్యాటకులు నివసించడానికి లేదా సందర్శించడానికి అనుమతి లేదు. కేవలం ఆయా దేశాల నౌకాదళ అధికారులు, సంరక్షణ సిబ్బంది మాత్రమే అధికార మార్పిడి సమయంలో, నిర్వహణ పనుల కోసం ఇక్కడికి వస్తుంటారు. సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఈ అధికార మార్పిడి ప్రక్రియ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది.