AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీ నిమ్మకాయలు@ రూ.850! నార్వే ధరలపై NRI వీడియో వైరల్

నార్వేలో ఉంటున్న ఓ భారతీయుడు అక్కడి కూరగాయల ధరలను.. భారత్‌లోని ధరలతో పోల్చుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆర్గానిక్ నిమ్మకాయలు కిలో రూ.850, టమాటాలు కిలో రూ.680, ఒక్క దోసకాయ దాదాపు రూ.300 ఉండటాన్ని చూపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

కేజీ నిమ్మకాయలు@ రూ.850! నార్వే ధరలపై NRI వీడియో వైరల్
Man Compares Vegetable Prices In Norway And India
Sharada V
|

Updated on: Sep 30, 2026 | 7:03 PM

Share

నార్వేలో ఉంటున్న వినోద్ అనే వ్యక్తి వీడియోను Xలో షేర్ చేశారు. ‘‘నార్వేలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నప్పటికీ, ప్రతిసారీ షాపుకు వెళ్లినప్పుడు వేరు వేరు ధరలు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి’’ అని వినోద్ అన్నారు. నార్వేలోఆర్గానిక్ నిమ్మకాయలు కిలో ఏకంగా రూ.850 ధర పలుకుతుంటే, టమాటాలు కిలో రూ.680, ఒక్క దోసకాయ ధర రూ. 300గా ఉంది. అదే భారత్‌లోని మెట్రో నగరాల్లో నాణ్యతను బట్టి నిమ్మకాయలు కిలో రూ.90-110, టమాటాలు కిలో రూ.60-80, దోసకాయలు ఒక్కటి రూ.20-30 వరకు ఉంటాయి.

‘భారత్‌లో కూరగాయలు ఎనిమిది రెట్లు చౌక’

భారత్‌తో పోలిస్తే నార్వేలో కూరగాయలు దాదాపు ఎనిమిది రెట్లు ఖరీదైనవి అని వినోద్ తన పోస్టులో తెలిపారు. అయితే నార్వేలో జీతాలు భారత్‌తో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండవని వ్యాఖ్యానించారు. అయితే భారత్‌లో రైతులకు వారి శ్రమకు తగిన ధర లభిస్తుందా? అన్న ప్రశ్నతో నెటిజన్లను ఆలోచింపచేసారు.‘‘భారత్‌లో మనం రైతులకు న్యాయమైన ధర చెల్లిస్తున్నామా? వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందా?’’ అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు భారత్‌లో కూరగాయలు తక్కువ ధరకు లభించడం వల్ల సామాన్య ప్రజలకు రోజువారీ భోజనం అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం తక్కువ ధరల వెనుక రైతులకు అందుతున్న ఆదాయం, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇంకొందరు నార్వే, భారత్‌ల తలసరి ఆదాయం, జీవన వ్యయం, వేతనాలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరలను పోల్చాలని సూచించారు. దీంతో ఈ వీడియో కేవలం కూరగాయల ధరల పోలికగా కాకుండా.. రైతులకు దక్కుతున్న ధర, వినియోగదారులపై భారం, వ్యవసాయ సరఫరా వ్యవస్థపై చర్చకు దారితీసింది.

Follow Us