వయసుదేముంది బాస్ జస్ట్ నంబర్ మాత్రమే.. ఆమెకు 47.. ఆయనకు 76.. లేటు వయస్సులో ఘాటైన ప్రేమ చిగురించింది.. ఇంకేముంది ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. రెండు మనస్సులు కలిస్తే చాలని వీరద్దరూ మరోసారి రుజువుచేశారు. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటూ.. చివరకు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 76 ఏళ్ల వయస్సులో.. 47 వయస్సున్న మహిళతో ప్రేమలో పడ్డ ఓ వృద్ధుడు తాజాగా పెళ్లి చేసుకుని వైరల్ గా మారాడు. లేటు వయసులో చిగురించిన ఈ ప్రేమ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడ్డాడ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన రామచంద్ర సాహు (76) అనే వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేశాడు. ఈ క్రమంలో భార్య మరణించింది. దీంతో దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. అయితే.. దాని కోసం ప్రయత్నాలు మొదులుపెట్టిన క్రమంలో.. ఎనిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్ కులాగర్ గ్రామానికి చెందిన త్రినాథ్ సాహు కుమార్తె సురేఖ (46) ను ఒకసారి చూశాడు.
అయితే, అలా చూసిన తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డానని.. పెళ్లిచేసుకుంటానని రామచంద్ర చెప్పిన మాటలకు సురేఖ కూడా అంగీకరించింది. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీశారు.
చివరకు జులై 19న భంజ్‌నగర్ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో ఆచారాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ వయసులో తమ ప్రేమ పెళ్లిని అడ్డుకోకుండా.. కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ఆలోచించాలని ఇద్దరూ పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..