
మనం ఓ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే.. వారితో కాసేపు మాట్లాడినా, కొంచెంసేపు కలిసి ట్రావెల్ చేసినా.. ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తుంది. కానీ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని.. తెలుసుకోవడానికి అతడి శరీర ఆకృతి లేదా కళ్లు, చెవులు, పాదాల ఆకారాన్ని బట్టి కూడా చెప్పవచ్చునని కొందరు న్యూమరాలజిస్టులు చెబుతుంటారు. అదొక్కటే కాదు.. ముఖం ఆకారం బట్టి కూడా మీ రహస్య వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చు.
ఓవల్ ఆకారంలో మీ ముఖం ఆకృతి ఉంటే.. ఆ వ్యక్తులు ఎప్పుడూ తమ మాటను వెనక్కి తీసుకోరు. వీరికి ఎక్కడ, ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. వీరి మాటకారితనంతోనే ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తారు. సున్నితమైన వ్యక్తులు, నమ్మకంగా ఉంటారు. అలాగే ఎంతో సృజనాత్మకత కలిగినవారు. ఇక ఈ ఆకృతి కలిగిన ముఖం ఉన్న మహిళలు తమ కుటుంబాల కంటే కెరీర్‌పై ఎక్కువగా దృష్టి పెడతారు.
చతురస్రాకార ముఖం ఉన్న వ్యక్తులు నిజాయితీపరులు, ముక్కుసూటిగా ఉంటారు. చాలా సృజనాత్మకత కలిగినవారు, సమస్యలను ఎలా పరిష్కరించాలో బాగా తెలుసు. వీరు తన సహోద్యోగులు, స్నేహితులకు ఓ నాయకుడిగా ఉంటారు. మొండి పట్టుదల, చురుకైనవారు, అవసరానికి అనుగుణంగా పరిస్థితులను చక్కపెడతారు.
గుండ్రని ముఖం ఉన్న వ్యక్తులు దయగలవారు. ఇతరులకు సహాయం చేయడంలో, దానం చేయడంలో ముందుంటారు. విశాల హృదయం కలిగిన వ్యక్తులు. ఎలప్పుడూ పాజిటివ్ వైబ్స్ కలిగి ఉంటారు. నిరాడంబరమైన మనస్తత్వం కలిగినవారు, తమ సంతోషం కంటే ఇతరుల సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
దీర్ఘచతురస్రాకార ముఖం ఉన్న వ్యక్తులు విశ్లేషణాత్మక నైపుణ్యం కలిగి ఉంటారు. ఆలోచనాత్మక మనస్సు కలిగి ఉంటారు. వారు ప్రతి విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తెలివితేటలు, కష్టపడి పనిచేయడం, విశ్వసనీయత వంటి లక్షణాలను కలిగి ఉంటారు.
హృదయాకార ముఖం ఉన్న వ్యక్తులు బలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు వారు చాలా మొండి స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ప్రతి పనిని ఒక నిర్దిష్ట మార్గంలో చేస్తారు. వారు అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ప్రజల మనోభావాలను, పరిస్థితులను సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు.
వజ్ర ముఖం ఉన్న వ్యక్తులు తమ జీవితాలను తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. వారు ఏ పరిస్థితినైనా, అది మంచిదైనా లేదా చెడుదైనా.. పూర్తిగా కంట్రోల్‌లో ఉంచుతారు. వారికి సృజనాత్మకత, తెలివితేటలు రెండూ ఎక్కువే.