AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి? మన దేశంలోని ఈ మిస్టరీ విలేజ్ గురించి తెలిస్తే..

పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి ఒకే చోట ఆత్మహత్యలు చేసుకుంటాయంటే నమ్మడం కష్టమే.. కానీ ఇది కల్పిత కథ కాదు.. నిజం.. మనదేశంలోనే ప్రతీ ఏటా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యకాలంలో వందలాది పక్షులు మర్మమైన రీతిలో ప్రాణాలు విడుస్తుంటాయి. పక్షులు ఎందుకు ఇలా వింతగా ప్రాణాలు తీసుకుంటున్నాయి? ఆ ఒక్క గ్రామంలోనే ఈ ఘోరం ప్రతి ఏటా ఎందుకు జరుగుతుంది? అనేది తెలుసుకుందాం..

అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి? మన దేశంలోని ఈ మిస్టరీ విలేజ్ గురించి తెలిస్తే..
Why Do Birds Mass Deaths In Jatinga
Krishna S
|

Updated on: Aug 09, 2026 | 7:13 PM

Share

మనుషులు తీవ్రమైన మనస్తాపం, దుఃఖం, ఓటమి లేదా అహంకారం వల్ల ఆత్మహత్యలకు పాల్పడటం వింటూనే ఉంటాం. కానీ పక్షులు గుంపులు గుంపులుగా ఒకే ప్రదేశానికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడైనా విన్నారా? ఇది ఏమాత్రం కల్పిత కథ కాదు.. నూటికి నూరు శాతం నిజం. మన దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ప్రతీ ఏటా వందలాది పక్షులు మర్మమైన రీతిలో కిందపడి చనిపోతుంటాయి. మనుషుల ఆత్మహత్యల వెనుక రకరకాల విచారకరమైన కారణాలు ఉండవచ్చు.. మరి పక్షులు ఎందుకు ఇలా ప్రాణాలు తీసుకుంటున్నాయి? ఆ ఒక్క గ్రామంలోనే ఈ వింత దృశ్యం ఎందుకు రిపీట్ అవుతుంది? ఆ అంతుచిక్కని రహస్యాల వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటీ అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది.

ఎక్కడుంది ఈ వింత గ్రామం?

అస్సాంలోని దిమా హసావో జిల్లాలోని కొండల మధ్య ఉన్న ఒక చిన్న అందమైన ప్రాంతమే జటింగా. ప్రధానంగా గిరిజన తెగలకు చెందిన ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని స్థానికులు, పర్యాటకులు పక్షుల మృత్యు లోయ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం పూర్తయ్యాక.. అంటే సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యకాలంలో ఇక్కడ అత్యంత విచిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో వందలాది పక్షులు ఉన్నట్టుండి చెట్లను, భవనాలను, విద్యుత్ స్తంభాలను ఢీకొని ప్రాణాలు విడుస్తుంటాయి.

అసలు రాత్రివేళ అక్కడ ఏం జరుగుతుంది?

గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ముఖ్యంగా అమావాస్య రాత్రులలో, వాతావరణం దట్టమైన పొగమంచు, మేఘాలతో కప్పబడి ఉన్నప్పుడు ఈ విపరీతం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య సమయంలో కింగ్ ఫిషర్లు, టైగర్ బిట్టర్న్లు, లిటిల్ ఎగ్రెట్లు, పచ్చ పావురాలు వంటి రకరకాల స్థానిక పక్షుల గుంపులు ఉన్నట్టుండి గ్రామం వైపు ఎగురుతూ వస్తాయి. దిక్కుతోచని స్థితిలో, అత్యంత వేగంగా వచ్చి అక్కడ ఉన్న వెదురు కర్రలను, చెట్ల కొమ్మలను, స్తంభాలను తీవ్రంగా ఢీకొడతాయి. రక్తగాయాలై కిందపడి ప్రాణాలు వదులుతాయి.

దుష్టశక్తుల ప్రకోపమేనా? స్థానికులు ఏమంటున్నారు?

దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఘోరాన్ని చూసి స్థానిక ప్రజలు తీవ్రంగా భయాందోళన చెందుతుంటారు. ఆకాశంలో తిరిగే దుష్టశక్తులు లేదా దెయ్యాలే ఈ పక్షులను కిందకు గుంజి చంపేస్తున్నాయని వారు గట్టిగా నమ్ముతారు. గ్రామాన్ని పీడిస్తున్న ఏదో శాపం వల్లే పక్షులు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాయని ఇప్పటికీ భావిస్తుంటారు.

పక్షి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

ఈ అంతుచిక్కని మిస్టరీని ఛేదించేందుకు ప్రముఖ పక్షి శాస్త్రవేత్త అన్వరుద్దీన్ చౌదరితో పాటు అనేకమంది అంతర్జాతీయ నిపుణుల బృందాలు జటింగాలో పరిశోధనలు జరిపాయి. సైన్స్ ప్రకారం ఇవి ఆత్మహత్యలు కావని, వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న ప్రమాదాలు అని తేల్చారు. నిపుణులు చెబుతున్న ప్రధాన కారణాలు ఇవే..

ఆవాసాలు కోల్పోవడం: వర్షాకాలంలో అస్సాంలోని లోతట్టు ప్రాంతాలు తీవ్ర వరదలకు గురవుతాయి. దీంతో పక్షులు తమ నివాసాలను కోల్పోయి, సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో జటింగా లోయ గుండా ప్రయాణిస్తాయి.

దిశ కోల్పోవడం: సెప్టెంబర్ – నవంబర్ మధ్య ఇక్కడ వీచే బలమైన ఈదురుగాలులు, దట్టమైన పొగమంచు వల్ల ముఖ్యంగా చిన్న, అనుభవం లేని పక్షులు దిక్కుతోచక అయోమయానికి గురవుతాయి.

కాంతికి ఆకర్షితమవ్వడం: చీకటి, దట్టమైన పొగమంచులో దారి తెలియక తికమకపడుతున్న పక్షులకు గ్రామంలో వెలిగే దీపాలు, వీధి దీపాలు, సెర్చ్‌లైట్ల వెలుగులు కనిపిస్తాయి. దీంతో వెలుతురు ఉన్న వైపు వేగంగా దూసుకొచ్చి, దారిలోని చెట్లను, ఇళ్లను ఢీకొని ప్రాణాలు కోల్పోతాయి.

భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు: ఆ సమయంలో ఆ కొండ ప్రాంతంలోని నీటిలో, నేలలో ఉండే తాత్కాలిక అయస్కాంత ధర్మాలలో మార్పులు రావడం వల్ల, పక్షుల అంతర్గత నావిగేషన్ వ్యవస్థ దెబ్బతింటుందని కూడా కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు.

మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా..

ఇలా పక్షులు దిశకోల్పోయి ప్రాణాలు కోల్పోయే వింత ప్రవర్తన కేవలం భారతదేశంలోని జటింగా గ్రామానికే పరిమితం కాలేదు. ఆసియాలోని ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాల్లోని కొన్ని కొండ ప్రాంతాలలో కూడా నిర్దిష్ట వాతావరణ పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని పక్షి శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Follow Us