Teenager Reports Father: స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతే నష్టాలు కూడా ఉన్నాయి. నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వ్యసనం చాలా చెడ్డది. పిల్లలు ఎక్కువగా ఈ వ్యసనానికి బానిసవుతున్నారు. ఇది చూసిన తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త వింటే మీరు షాకవుతారు. చైనాలోని 14 ఏళ్ల బాలుడిని తండ్రి ఇంటి పనులు చేయమని అడిగాడు. వెంటనే ఆ పిల్లవాడు కోపంతో పోలీసులకు ఫోన్ చేశాడు.
ఒక నివేదిక ప్రకారం.. ఈ వింత సంఘటన చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో జరిగింది. ఇక్కడ నివసిస్తున్న ఓ వ్యక్తి తన కొడుకు నిత్యం ఫోన్‌లో బిజీగా ఉండడం చూసి ఆందోళన చెందాడు. తనని చదువుకోమని ఆర్డర్ వేశాడు అయినా పిల్లవాడు వినలేదు. అతడికి ఎలాగైనా బుద్ది చెప్పాలని చివరికి ఇంటి పనులు చేయమని హుకుం జారీ చేశాడు. తర్వాత కొడుకు చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడుతారు. తండ్రి కోపంతో అలా చెప్పడంతో కొడుకు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. మా నాన్న నన్ను బలవంతంగా ఇంట్లో పని చేయిస్తున్నాడని కంప్లెయింట్ ఇచ్చాడు.
ఈ విషయం పోలీసులకు కూడా అర్థంకాకపోవడంతో బాలుడి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. కుమారుడితో కలిసి పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయమై పోలీసులకు పూర్తి వివరాలు తెలిపిన తండ్రి కుమారుడి దృష్టిని ఫోన్‌పై నుంచి మళ్లించాలనుకున్నానని చెప్పాడు. అందుకే ఏదో పని చేయమని అడిగాగని బదులిచ్చాడు. బాలుడి స్మార్ట్‌ఫోన్ వ్యసనం గురించి పోలీసులకు తెలియడంతో వారు తన కొడుకుకు క్రమశిక్షణ నేర్పించాలని తండ్రికి సూచించారు. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్‌ను అబ్బాయికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించండని చెప్పారు. ఇంతటితో కథ ముగిసింది.