Ratan Tata cake: రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. యావత్ భారతాన్ని ఆకర్షిస్తున్న మానవతామూర్తి..

|

Dec 27, 2024 | 12:03 PM

పుట్టిన జీవికి మరణం తప్పదు.. మరణించిన జీవికి జన్మ తప్పదు ఇది సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం. అయితే కొంతమంది మరణించీ చిరంజీవులు. తమ పనులతో, నడకతో, నడతతో ప్రజల మనస్సులో నిలిచిపోతారు. చరిత్ర పుటల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. అలాంటి మహానీయులలో నేటి మేటి మనిషి దివంగత భారతీయ వ్యాపారవేత్త రతన్ టాటా. తాజాగా ఓ బేకరీ యజమాని రతన్ టాటా కుక్కతో కరచాలనం చేస్తున్న కేక్ విగ్రహాన్ని తయారు చేశాడు.

Ratan Tata cake: రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. యావత్ భారతాన్ని ఆకర్షిస్తున్న మానవతామూర్తి..
Ratan Tata Cake
Follow us on

మనలో ప్రతి ఒక్కరూ మనం ప్రేమించే వ్యక్తులను వివిధ మార్గాల్లో మన ప్రేమని తెలియజేస్తాం. తమ శక్తి మేరకు గౌరవించదలిచిన పద్ధతిని ఎంచుకుంటారు. అయితే కొంతమంది పది మంది దృష్టిని ఆకర్షించేలా కొన్ని విభిన్న పద్ధతులు అనుసరిస్తారు. అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది తాజాగా రతన్ టాటా కుక్కతో ఉన్న ఓ కేక్. తమిళనాడులోని రామనాథపురం జిల్లా భారతీ నగర్‌లోని ఓ బేకరీలో ప్రదర్శనకు ఉంచిన కేక్ పలువురి దృష్టిని ఆకర్షించింది. క్రిస్‌మస్ సందర్భంగా తయారు చేసిన ఈ కేక్ యావత్ భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది. రామనాథపురం జిల్లాలో గత 21 ఏళ్లుగా ఐశ్వర్య బేకరీ నడుపుతున్నారు.

ఐదు శాఖలను కలిగి ఉన్న ఈ సంస్థ కస్టమర్‌లను ఆకర్షించడానికి..చరిత్రన సృష్టించిన వ్యక్తులను గుర్తు చేస్తూ వారిని సత్కరించడానికి ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఒక భారీ కేక్ ను తయారు చేస్తుంది. ఈ కేక్ ను తమ స్టోర్ ముందు ప్రదర్శిస్తుంది. ఆ విధంగా ఈ సంవత్సరం దివంగత వ్యాపార వేత్త.. మానవతా మూర్తి రతన్ టాటాను కేక్ గా నిలువెత్తు బొమ్మని తయారు చేసి ప్రదర్శించింది.

ఈ కేక్ స్పెషాలిటీ ఏమిటంటే

రాయల్ ఐసింగ్ పద్ధతిని ఉపయోగించి చక్కెర, గుడ్డులోని తెల్లసొనతో తయారు చేయబడిన ఈ కేక్ క్యాండీ రతన్ టాటా ఆకృతిని కలిగి ఉంది. దాదాపు 60 కిలోల చక్కెర, 250 గుడ్లని ఉపయోగించి తయారు చేసిన ఈ కేక్ 7 అడుగుల పొడవు, 70 కిలోల బరువు ఉంది. ఈ రతన్ టాటా కేక్‌ను రక్షించడానికి గాజుతో చేసిన బాక్స్ ని రెడీ చేశారు. ఇందు కోసం దాదాపు లక్ష వరకు ఖర్చు చేసినట్లు దుకాణం యజమాని చెప్పారు. ఈ కేక్‌ని ఆరు రోజుల్లో దాదాపు 5 మంది కేక్ మాస్టర్లు ఎంతో శ్రమ పడి తయారు చేశారు.

ఇవి కూడా చదవండి

నీటిలో కరిగే కేక్:

“ఇది ఇతర కేక్ లాంటిది కాదు. దీనిని మైదా ఉపయోగించకుండా తయారుచేశారు. అయితే ఈ రతన్ టాటా కేక్‌ వెంటనే పాడైపోదు. దీనిని తయారు చేసినప్పుడు మెత్తగా ఉంది. అయితే ఎండ తలిగిన తర్వాత ఈ కేక్ మందంగా మారిపోతుంది. కేక్ కు ఎటువంటి పగుళ్ళు రావు. అందుకనే ఈ కేక్ ను ప్రదర్శనార్ధం జనవరి 1 వ తేదీ వరకూ ఉంచుతామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల తర్వాత నీటిలో కరిగిస్తాం’’ అని చెప్పారు

భారీ స్పందనను సొంతం చేసుకున్న రతన్ టాటా విగ్రహం

ఈ రతన్ టాటా కేక్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. అంతకుముందు భారతియార్, ఫుట్‌బాల్ ప్లేయర్ మారడోనా, సంగీతకారుడు ఇళయరాజా విగ్రహాలు, క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ప్రపంచ కప్ విగ్రహాలకు కూడా ఇంతా స్పందన రాలేదు. అయితే ఇప్పుడు ఏర్పాటు చేసిన రతన్ టాటా విగ్రహానికి భారీ స్పందన లభించింది. భారతీయుల దృష్టిని ఆకర్షించింది. తమిళ మీడియా మాత్రమే కాదు.. భారతదేశంలోని అన్ని భాషా మీడియాలు రతన్ టాటా నిలువెత్తు కేక్ కు సంబందించిన వార్తలను ప్రసారం చేశాయి. తన జీవిత కాలంలో విలువలతో కూడిన వ్యాపారాన్ని చేసిన మానవతా మూర్తి రతన్ టాటా అంటే భారత దేశ ప్రజలకు ఎంతో ఇష్టం. కనుక తన రతన్ టాటా కేక్ యావత్ భారతదేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది అని సతీస్ రంగనాథన్ ఆనందంగా చెప్పారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..