AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు 90లక్షలు.. ఇప్పుడు 30 లక్షలు.. నీ అదృష్టానికి దండం సామీ.. లక్కు తోక తొక్కినవ్ పో..

అదృష్టం ఒక్కసారి తలుపు తడితేనే జీవితం మారిపోతుంది. అలాంటిది ఆ కుటుంబాన్ని లక్ష్మీదేవి వరుసగా రెండోసారి వరించింది. రెండేళ్ల క్రితం రూ. 93 లక్షల వజ్రంతో కోటీశ్వరులైన గిరిజన రైతు కుటుంబానికి.. ఇప్పుడు అదృష్టం డబుల్ ధమాకా ఇచ్చింది. పన్నా గనుల్లో రాత్రికి రాత్రే ఆ కూలీల తలరాత ఎలా మారిందో తెలుసుకుందాం.

అప్పుడు 90లక్షలు.. ఇప్పుడు 30 లక్షలు.. నీ అదృష్టానికి దండం సామీ.. లక్కు తోక తొక్కినవ్ పో..
Panna Tribal Family Finds Second Diamond
Krishna S
|

Updated on: Jun 30, 2026 | 9:04 AM

Share

అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. కొందరు రాత్రికి రాత్రే లక్షాధికారులు అవుతారు. పక్కన ఉండి చూసేవాళ్లకు సైతం అది నమ్మకం కష్టంగా ఉంటుంది. ఇక చాలా మంది జీవితంలో అపార విలువైన వజ్రం దొరకడం అనేది ఒక కల. దొరికితే వారికంటే అదృష్టవంతులు ఎవరు ఉండదరు. అయితే మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన ఒక గిరిజన రైతు కుటుంబానికి మాత్రం ఈ అదృష్టం రెండు సార్లు తలుపు తట్టింది. రెండేళ్ల క్రితం కోట్ల విలువైన వజ్రాన్ని కనుగొన్న అదే కుటుంబం, ఇప్పుడు మరోసారి సుమారు రూ. 30 లక్షల విలువైన అపురూపమైన వజ్రాన్ని వెలికితీసి వార్తల్లో నిలిచింది.

రెండు నెలల శ్రమకు దక్కిన ఫలితం

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… కూలీ రాకేష్ ఆదివాసి, అతని ముగ్గురు సోదరులు, మరికొందరు బంధువులతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అహిర్‌గావ్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ భూమిని లీజుకు తీసుకుని మైనింగ్ పనులు ప్రారంభించారు. దాదాపు రెండు నెలల పాటు రాత్రింబగళ్లు కష్టపడిన తర్వాత, సోమవారం వారికి 11.19 క్యారెట్ల అపురూపమైన, రత్న నాణ్యత కలిగిన వజ్రం లభించింది. దీని విలువ మార్కెట్లో సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం వారు ఆ వజ్రాన్ని వెంటనే ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో జమ చేశారు.

అదృష్టాన్ని మార్చిన పాత వజ్రం

ఈ కుటుంబానికి వజ్రం దొరకడం ఇది మొదటిసారి కాదు. 2024లో వీరు వెలికితీసిన 19.22 క్యారెట్ల భారీ వజ్రం ప్రభుత్వ వేలంలో ఏకంగా రూ. 93 లక్షలకు అమ్ముడుపోయింది. ఆ డబ్బుతో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, అయినప్పటికీ తాము కష్టపడటం ఆపలేదని రాకేష్ సోదరుడు రాజు ఆదివాసి ఉత్సాహంగా తెలిపారు.

నెక్ట్స్ ఏమిటి?

పన్నా డైమండ్ ఇన్‌స్పెక్టర్ నూతన్ జైన్ ఈ వజ్రం యొక్క నాణ్యతను ధృవీకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారు. రాబోయే ప్రభుత్వ వేలంలో ఈ 11.19 క్యారెట్ల వజ్రాన్ని అమ్మకానికి పెడతారు. వజ్రం అమ్ముడైన తర్వాత ప్రభుత్వం తన రాయల్టీని మినహాయించుకుని, మిగిలిన పూర్తి మొత్తాన్ని నేరుగా ఆ కుటుంబం బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ‘‘ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని మేము వృథా చేయము. దీనిని మళ్లీ కొత్త మైనింగ్ పనుల్లో పెట్టుబడిగా పెడతాం. మా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ కష్టపడటం కొనసాగిస్తాం’’ అని రాకేష్ ఆదివాసి ధీమాగా వ్యక్తం చేశారు. వజ్రాల నిల్వలకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పన్నా జిల్లాలో అప్పుడప్పుడు జరిగే ఇలాంటి అద్భుతాలు.. అక్కడి కూలీల జీవితాలను రాత్రికి రాత్రే మార్చేస్తూ సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.

Follow Us