10 ప్రాంతాలే టార్గెట్ గా .. అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు

అఫ్గానిస్థాన్‌లోని 10 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక, డ్రోన్ దాడులు నిర్వహించింది పాకిస్థాన్.  డ్రోన్లను ప్రయోగించడానికి, వాటిని నిల్వ చేయడానికి ఉపయోగించిన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్థాన్ సమాచార మంత్రి అట్టా తరార్ తెలిపారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడుకునే హక్కులో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. దాడులు కచ్చితంగా, పరిమిత స్థాయిలో సైనిక లక్ష్యాలపైనే జరిపినట్లు మంత్రి స్పష్టం చేసారు.

10 ప్రాంతాలే టార్గెట్ గా .. అఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు
Pakistan Launches Air Strikes On Afghanistan

Updated on: Sep 24, 2026 | 3:24 PM

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అఫ్గానిస్థాన్ నుంచి డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపిస్తున్న పాకిస్థాన్.. తాజాగా ఆ దేశంలోని 10 ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. పాకిస్థాన్‌పై ఒక రోజు ముందు డ్రోన్ దాడులు జరిగాయనీ వాటికి ప్రతిస్పందనగానే ఈ దాడులు చేపట్టినట్లు పాకిస్థాన్ తెలిపింది. .

10 ప్రాంతాలపై దాడులు

అయితే పాకిస్థాన్ తాజా దాడులపై అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ స్పందించలేదు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ వారంలోనే పాకిస్థాన్ అఫ్గానిస్థాన్‌లోని కునార్, పక్తికా ప్రావిన్సులపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించినట్లు అఫ్గాన్ అధికారులు తెలిపారు. తాజా దాడులతో రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న డ్రోన్ దాడులు, వైమానిక దాడులు ఎక్కడికి దారితీస్తాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

టిటిపీ విషయంలోనే అసలు వివాదం

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ పాలకుల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో మరింత దిగజారాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) మిలిటెంట్లపై చర్యలు తీసుకోవడంలో కాబూల్ విఫలమైందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అఫ్గానిస్థాన్ భూభాగాన్ని ఉపయోగించుకుని TTP మిలిటెంట్లు శిక్షణ పొందుతున్నారని, అక్కడి నుంచే పాకిస్థాన్‌లో దాడులకు పాల్పడుతున్నారని పాకిస్థాన్ చెబుతోంది. ఈ అంశమే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది.

కోహాట్ దాడి తర్వాత మరింత ఉద్రిక్తత

ఇదే సమయంలో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కోహాట్‌లో జరిగిన భారీ దాడి పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. పాత పోలీస్ లైన్స్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 100 మంది గాయపడ్డారు. దాడి అనంతరం భద్రతా బలగాలు రాత్రంతా ఆపరేషన్ నిర్వహించాయి. పోలీస్ లైన్స్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే క్రమంలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు.ఈ ఘటనల నేపథ్యంలోనే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా అఫ్గానిస్థాన్‌లోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులు చేయడం ఈ వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us