“తీవ్రవాదులమా?” వీసాలున్నా భారత్‌కు వెళ్లాల్సిన 92 మంది సిక్కు యాత్రికులను అడ్డుకున్న పాకిస్థాన్ అధికారులు
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ హేమ్‌కుండ్ సాహిబ్ సందర్శన కోసం భారత్‌కు వెళ్లాల్సి ఉన్న 90 మందికి పైగా పాకిస్థానీ సిక్కు యాత్రికులకు ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి తీవ్ర నిరాశ ఎదురైంది. వీరికి భారతీయ వీసాలు సక్రమంగా ఉన్నప్పటికీ, ఫైసలాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని భారత్‌కు వెళ్లే విమానం ఎక్కకుండా శుక్రవారం అడ్డుకున్నారు.

నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో, దుబాయ్ మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ఇన్‌డైరెక్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న ఈ యాత్రికులను చివరి నిమిషంలో బోర్డింగ్ చేయకుండా నిలిపివేసారు.
పాకిస్థానీ సిక్కులు భారత్‌లోని మతపరమైన స్థలాలను సందర్శించడానికి అవసరమైన ప్రభుత్వ ముందస్తు అనుమతులు లేదా ఎన్‌వోసీ (NOC) నిబంధనల పేరుతో ఈ అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. వీసాలు ఉన్నప్పటికీ మతపరమైన యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవడం పట్ల సిక్కు వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
మహిళలు, పిల్లలతో సహా మొత్తం 92 మంది పాకిస్థానీ సిక్కు యాత్రికులు భారత్‌కు బయలుదేరేందుకు లాహోర్‌కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైసలాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. దుబాయ్ మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ఇన్‌డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కవలసి ఉన్న ఈ యాత్రికులను నిలిపివేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే విమానం ఎక్కాల్సిన ఈ యాత్రికుల వద్ద రిటర్న్ టికెట్ (తిరుగు ప్రయాణ టికెట్) లేకపోవడంతో పాటు, ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (NOC) లేదని ఆ అధికారి తెలిపారు. ఈ రెండు ముఖ్యమైన పత్రాలు (రిటర్న్ టికెట్, ప్రభుత్వ ఎన్‌వోసీ) వారి వద్ద లేకపోవడం వల్లే విమానం ఎక్కేందుకు అనుమతించలేదని ఎఫ్‌ఐఏ (FIA) స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఎలాంటి విమాన, రైలు లేదా రోడ్డు మార్గాలు అందుబాటులో లేవు.ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో, మతపరమైన యాత్రలు లేదా అత్యవసర పనుల నిమిత్తం ప్రయాణించాలనుకునే వారు దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల మీదుగా భారత్ చేరుకునే పరిస్థితి ఉంది.
స్వంత ఏర్పాట్లే కొంపముంచాయా?
ఈ సిక్కు యాత్రికులు పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ‘జాతా’ (తీర్థయాత్రల బృందం) కింద కాకుండా, దిల్లీలోని గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీ ద్వారా తమకు కావలసిన భారతీయ వీసాలను పూర్తిగా సొంత ప్రయత్నాలతో సమకూర్చుకున్నారు. అధికారిక మార్గంలో కాకుండా వ్యక్తిగతంగా లేదా ప్రత్యేక కమిటీల ద్వారా వీసాలు పొందడం, ప్రభుత్వపరమైన ముందస్తు అనుమతులు లేకపోవడమే ఫైసలాబాద్ విమానాశ్రయంలో అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా తెలుస్తోంది.
ఫైసలాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తమను భారత్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని, అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఓ పాకిస్థానీ సిక్కు యాత్రికుడు మాట్లాడిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. “మేం ఏమైనా తీవ్రవాదులమా? ” అంటూ అతను ప్రశ్నించాడు. తమ వద్ద సరైన పత్రాలు, వీసాలు ఉన్నప్పటికీ అధికారులు ప్రయాణాన్ని నిలిపివేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు.