
ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్‌మహల్ అంటే దాదాపుగా అందరికి ఇష్టమే. అయితే, తాజ్‌మహల్‌ని సందర్శించే అవకాశం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. అయితే, మీరు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను సందర్శించాలనుకుంటే మీకో శుభవార్త. మొఘల్ చక్రవర్తి షాజహాన్ మూడు రోజుల వార్షిక ఉర్సు వేడుకల సందర్భంగా భారత పురావస్తు సర్వే ( ASI) తాజ్ మహల్ ప్రవేశాన్ని పూర్తిగా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, జనవరి 15, 16, 17 తేదీలలో నిర్ణీత సమయాల్లో పర్యాటకులు టికెట్ లేకుండా ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్‌ను సందర్శించే అవకాశం వచ్చింది. ఈ మేరకు ASI అధికారిక ఉత్తర్వు జారీ చేసింది .
ASI జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, జనవరి 15, 16, 17 తేదీలలో తాజ్ మహల్ చూసేందుకు ఫ్రీ ఎంట్రీని ఉంది. ఇందుకోసం ASI టైమ్ కేటాయించింది. ఈ మేరకు జనవరి 15 గురువారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సూర్యాస్తమయం వరకు ప్రవేశం ఉచితం. జనవరి 16 శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సూర్యాస్తమయం వరకు సందర్శకులు తాజ్ మహల్‌ను ఫ్రీ చూడొచ్చు. ఇంకా, జనవరి 17 శనివారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అంటే మొత్తం రోజంతా ఎంట్రీ ఫ్రీ అని ప్రకటించారు.
ASI విడుదల చేసిన సమాచారం ప్రకారం… ఉర్సు సందర్భంగా నిర్దేశించిన సమయాల్లో తాజ్ మహల్‌లోని అన్ని టికెట్ కౌంటర్లు పూర్తిగా మూసివేస్తారు. పర్యాటకులు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. నిర్దేశించిన సమయాల్లో తాజ్‌మహల్‌లోనికి నేరుగా ప్రవేశించే అనుమతి ఉంటుంది. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ASI, స్థానిక పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నిజానికి , ప్రతి సంవత్సరం భారతదేశం, విదేశాల నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు, పర్యాటకులు షాజహాన్ ఉర్స్ కోసం ఆగ్రాకు వస్తారు. తాజ్ మహల్ కాంప్లెక్స్ లోపల సాంప్రదాయ ఆచారాలు కూడా నిర్వహిస్తారు. ప్రధాన సమాధిపై ఇంద్రధనస్సు రంగు షీట్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఉచిత ప్రవేశం పర్యాటకులకు ఉపశమనం కలిగించడమే కాకుండా హోటళ్ళు, గైడ్‌లు, రవాణా, ఇతర స్థానిక పర్యాటక వ్యాపారాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు. దీని పునాది రాయిని 1632 లో వేశారు. తరువాత తాజ్ మహల్ ప్రేమకథ, దాని అందం మొఘల్ వాస్తుశిల్పానికి చిహ్నంగా మారింది. నేడు, ఈ స్మారక చిహ్నం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..