Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
నేపాల్‌లో మరోసారి ప్రకృతి విలయం సృష్టించింది. బుధి గండకి నది ఉగ్రరూపం దాల్చడంతో గోర్ఖా జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరద నీరు గ్రామాలపై విరుచుకుపడింది. పది మంది గల్లంతయ్యారు. ఇళ్లు, వంతెనలు నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో నివాసాలు పూర్తిగా ధ్వంసమై శిథిలాలు మాత్రమే మిగిలాయి. వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూపిస్తున్నాయి.

ఉత్తర గోర్ఖా జిల్లాలో ఆదివారం ఉదయం వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. సల్లేరి, జగత్, దోవన్, ఘట్టేఖోలా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కనీసం 10 మంది గల్లంతయ్యారు. సల్లేరి బజార్‌లోకి వరద నీరు భారీగా ప్రవేశించడంతో అక్కడి నివాస ప్రాంతాలు దెబ్బతిన్నాయి. జగత్ బజార్‌లోనూ తీవ్ర నష్టం జరిగింది. సోటీ ఖోలా వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. చుమ్నుబ్రి గ్రామీణ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఉన్న పైను, బగర్ ప్రాంతాల్లో సుమారు 35 ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
వరదలకు కారణమేంటి?
బుధి గండకి నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నదికి అనుబంధంగా ఉన్న ఉపనది ప్రవాహానికి అడ్డంకి ఏర్పడటం లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల నీరు ఒక్కసారిగా ఉప్పొంగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, వరదలకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.
बुढीगण्डकीमा आएको बाढीबाट प्रभावित केही क्षेत्रको हेलिकोप्टरबाट लिइएका तस्विर https://t.co/gPNa0jWQ8t
— NDRRMA (@NDRRMA_Nepal) October 11, 2026
ఆరు వంతెనలు ధ్వంసం.. నిలిచిపోయిన రాకపోకలు
వరదల కారణంగా రహదారులు, రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాహనాలు వెళ్లే వంతెనలతో పాటు పాదచారులు ఉపయోగించే వేలాడే వంతెనలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తంగా ఆరు వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అరుఘాట్, త్రిపురసుందరి, సోటీ-మాన్బు ప్రాంతాల్లోని వంతెనలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ధార్చే గ్రామీణ మున్సిపాలిటీలోని బైలీ వంతెన కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని ఒక జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. హెలికాప్టర్లతో సహాయక చర్యలు
వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్ సైన్యంతో పాటు పోలీసులు, సాయుధ పోలీసు దళాలు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా స్పందిస్తూ.. సైనిక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపినట్లు తెలిపారు. ఖాట్మండు నుంచి ప్రత్యేక సహాయక బృందాన్ని విమానంలో అక్కడికి తరలించారు. నేపాల్ సైన్యం ఇప్పటివరకు ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
A short while ago: A devastating flash flood has swept away Salleri Bazaar (Market) and caused severe destruction in Jagat Bazaar along the Budhi Gandaki River, Gorkha District, Nepal.
(Video provided by Umesh.) https://t.co/aK74PD0S5t
— Weather Monitor (@WeatherMonitors) October 11, 2026
మరోవైపు, బుధి గండకి నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నేపాల్ హోంమంత్రి సుదన్ గురుంగ్ సూచించారు. నదిలో నీటి ప్రవాహం ఇంకా హెచ్చుతగ్గులకు లోనవుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలనిసూచించారు.
నేపాల్‌లో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆగస్టు 26న భోటేకోషి-త్రిశూలి ప్రాంతాల్లో సంభవించిన వరదల విషాదం నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆ ఘటనలో 1,455 మంది మరణించగా, 5,285 మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతలోనే గోర్ఖా జిల్లాలో మరోసారి వరదలు బీభత్సం సృష్టించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.