
వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. దాన్ని నిజం చేసింది ఓ ఆలివ్ రిడ్లీ తాబేలు. దాని నెంబర్ 03233. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా గహీర్‌మఠ్ దగ్గర సముద్రంలో ప్రయాణం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది. ఈ తాబేలు…ఒడిశాలోని గహీర్‌మఠ్ దగ్గర సముద్రంలో ప్రయాణం షురూ చేసి, 51 రోజుల్లో 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏపీ తీరానికి ఈదుకుంటూ వచ్చింది. ఇది రోజుకు సుమారుగా 20 కిలోమీటర్లు ఈదిందన్న మాట. ఇది డైరెక్టుగా ఏపీకి రాకుండా, శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరీలను సందర్శించుకుంటూ తెలుగు తీరానికి చేరింది. ఈ ఆలివ్ రిడ్లీ తాబేలుకు అమర్చిన జియో ట్యాగ్ ద్వారా ఈ వివరాలు సైంటిస్టులకు తెలిశాయి. ఈ చిన్న ప్రాణి…గుడ్లు పెట్టడానికి ఏకంగా రెండు సముద్రాలు దాటి ఏపీ తీరానికి వచ్చింది.
ఆలివ్‌రిడ్లే తాబేళ్ల జీవన విధానం, పునరుత్పత్తిపై చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక నాలుగేళ్ల కిందట ఒడిశా తీరంలో ట్యాగ్ వేసిన మరో తాబేలు 3,500 కి.మీ. ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి వచ్చింది. ఇది సైంటిస్టులను ఆశ్చర్యంలో పడేసింది. ఈ ఏడాది జనవరి 27న, మహారాష్ట్ర తీర ప్రాంతపు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా పని చేస్తున్న మాంగ్రోవ్ సెల్, మాంగ్రోవ్ ఫౌండేషన్‌కు చెందిన బృందం రత్నగిరి తీరంలో గుడ్లు పెట్టేందుకు వచ్చిన తాబేళ్లను గమనించింది. గుడ్లు పెట్టిన అనంతరం తాబేలు పక్కకు వెళ్లినపుడు, దాని ఫ్లిప్పర్‌పై ఒక ట్యాగ్ కనిపించింది. దానిపై ఉన్న నెంబర్ చూస్తే.. ఒడిశాలోని గంజాం జిల్లా, రుషికుల్య నదీ ముఖద్వారంలో, దానికి ట్యాగ్ వేసినట్లు గుర్తించారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన బృందం ట్యాగ్ వేసిన తాబేలేనని నిర్ధారించారు. ఇది గుడ్లు పెట్టడానికి ఏకంగా భారత తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం దాకా వెళ్లింది. గుడ్లు పెట్టడానికి సముద్రంలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు.
సాధారణంగా తాబేళ్లు, తాము పుట్టిన తీరానికే తిరిగి వచ్చి గుడ్లు పెడతాయి. కానీ 03233 తాబేలు మాత్రం ఈ సంప్రదాయాన్ని ధిక్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా అరుదైన సంఘటనగా దీన్ని భావిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ప్రపంచంలో అత్యధికంగా కనిపించే సముద్ర తాబేళ్లలో ఒకటి. అయితే వీటికి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సముద్ర జీవవైవిధ్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సముద్రపు పచ్చిక బయోసిస్టమ్, కోరల్ రీఫ్స్, ఇతర సముద్ర జీవుల జీవన వ్యవస్థను సజీవంగా ఉంచుతాయి. ఈ తాబేళ్ల సంఖ్య తగ్గడం వల్ల సముద్ర జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.