Viral: పొలంలో ఉబ్బిన పొట్టతో కదల్లేని పరిస్థితుల్లో కనిపించిన కొండచిలువ – అనుమానంతో పొట్ట చీల్చి చూడగా
63 ఏళ్ల రైతు పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. పొద్దు కూకినా రాలేదు. పొలానికి వెళ్లి చూసినా మనిషి కనిపించలేదు. అయితే ఆ పొలానికి సమీపాన ఓ భారీ కొండచిలువ ఉబ్బిన పొట్టతో కనిపించింది. కొంపదీసి ఆ కొండచిలువ ఆ రైతును పొట్టన బెట్టుకుందా..?

ఇండోనేషియాలోని సౌత్ బుటోన్ జిల్లాలో ఓ దుర్ఘటన కలకలం రేపింది. పొలం వెళ్లిన రైతు ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. చివరికి, అతని మృతదేహం 26 అడుగుల పొడవున్న కొండచిలువ కడుపులో కనిపించడం గ్రామస్తులను షాక్‌కు గురిచేసింది. 63 ఏళ్ల రైతు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. కానీ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గ్రామస్థులు కలిసి గాలింపు ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం మజపహిత్ గ్రామ శివారులో ఓ పెద్ద కొండచిలువ కదలకుండా ఉండటం గమనించిన స్థానికులు, అది ఏదైనా పెద్ద ప్రాణిని మింగి ఉంటుందని అనుమానించారు. వెంటనే ఆ పామును చంపి… కడుపు చీల్చి చూడగా అందులో రైతు మృతదేహం ఉన్నట్లు తెలిసింది.
“గ్రామస్తులు అనుమానంతో పామును చంపారు. లోపల రైతు మృతదేహం కనిపించింది. ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో ఇదే తొలిసారి” అని విపత్తు నిర్వహణ విభాగానికి చెందిన అధికారి లావొదే రిసావాల్ తెలిపారు. వర్షాకాలంలో కొండచిలువలు గ్రామాల్లోకి వస్తుంటాయి. సాధారణంగా అవి మేకలు, పంది లాంటి చిన్న జంతువులను మింగుతుంటాయి. కానీ మానవులపై దాడులు చేయడం చాలా అరుదు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
అయితే 2017లో సులవేసీ ద్వీపంలో అక్బర్ అనే రైతు కూడా ఇలానే కొండచిలువకు బలయ్యాడు. అప్పుడు కూడా స్థానికులు పామును చంపి, అతని మృతదేహాన్ని బయట తీశారు. కొండచిలువలు విషరహిత పాములు. తమ శరీరంతో ఇతర జీవుల్ని ఊపిరాడకుండా చుట్టేసి.. మింగేస్తాయి. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి పాములు ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తాయి. పొలాల్లోకి వెళ్లే రైతులు, అడవుల వద్ద నివసించే వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పాము కనిపించిన వెంటనే అటవీ శాఖకు, పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిది.
సున్నిత మనష్కులు దిగువన వీడియో చూడకండి…
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..