
మక్కాలో వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ కావడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు, సౌదీ అరేబియాలోని వేర్వేరు ప్రాంతాలపై హౌతీ తిరుగుబాటుదారులు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ వరుస దాడుల్లో 13 మంది గాయపడ్డారు. సౌదీపై హౌతీల దాడులు మరింత తీవ్రరూపం దాల్చాయి.
సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు పాల్పడటాన్ని ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్’ (OIC) తీవ్రంగా తప్పుబట్టింది. ముస్లింల పవిత్ర నగరమైన మక్కాను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత హేయమైన చర్య అని ఆ సంస్థ ఖండించింది. ఈ దాడులు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని OIC స్పష్టం చేసింది. సౌదీ అరేబియా భద్రతకు, పౌరుల రక్షణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ సంస్థ పునరుద్ఘాటించింది.
సౌది అరేబియా పై హౌతీల డ్రోన్ల దాడులు
కొన్ని రోజులుగా సౌదీ అరేబియాకు, హూతీ తిరుగుబాటుదారులకు మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మక్కా వైపు డ్రోన్ వచ్చిందని, దీని వెనుక హూతీల హస్తం ఉందని సౌదీ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను హూతీ తిరుగుబాటుదారులు ఖండించారు. తమపై సౌదీ అరేబియా చేస్తున్న ఈ ఆరోపణలు అవాస్తవమని హౌతీ రాజకీయ నేత హాజెమ్ అల్-అసద్ స్పష్టం చేశారు. మక్కాకు దక్షిణంగా దూసుకొచ్చిన ఒక మిసైల్ ను సౌదీ వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని కూల్చివేశాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా నగరంలో వైమానిక ముప్పు హెచ్చరిక (ఎయిర్ రెయిడ్ అలర్ట్) జారీ కావడం మాత్రం చరిత్రలో ఇదే తొలిసారి. 2017లో హూతీలు మక్కాను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించగా, మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు అలాంటి ఘటనే పునరావృతమైంది.
హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రానికి దక్షిణాన ఉన్న కొన్ని కీలకమైన ద్వీపాలను తాజాగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న హూతీలకు ఇది పెద్ద విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల కారణంగా మదీనా అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను నిలిపివేసారు. హూతీల నుంచి ముప్పు పెరుగుతుండటంతో అప్రమత్తమైన సౌదీ అరేబియా ఈజిప్టు, గల్ఫ్ దేశాల సహాయాన్ని కోరినట్లు సమాచారం. సౌదీ ప్రధాని మొహ్మద్ బిన్ సల్మాన్అ మెరికా సైన్యం సాయంతో ఇజ్రాయెల్‌తో పరోక్షంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు జరుపుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. సౌదీ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా, పౌరుల మౌలిక వసతులు, ఆర్థిక కేంద్రాలపై దాడులు జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. ఈ దాడుల వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతినడమే కాకుండా, వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న ‘బాబ్ ఎల్-మండెబ్’ (Bab-el-Mandeb) జలసంధి వద్ద అంతర్జాతీయ నౌకాదళం, స్వేచ్ఛా సంచారానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని భారత్ హెచ్చరించింది. ఈ ప్రాంతంలో త్వరలోనే శాంతిభద్రతల పునరుద్ధరణ జరగాలని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది.