14వారాల గర్భిణీలో కడుపులో అంతుబట్టని పెరుగుదల..! స్కాన్ చేసిన డాక్టర్లు కంగుతిన్నారు..
గర్భధారణ సమయంలో పొత్తికడుపులో కణితి పెరగడం అనేది కొందరు మహిళల్లో అసాధారణమైన పరిస్థితి. వైద్య ప్రపంచంలో చాలా మంది మహిళలు ఇలాంటి పరిస్థితితో బిడ్డకు జన్మనిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఢిల్లీలోని భివాడికి చెందిన 25 ఏళ్ల మహిళ గర్భధారణ సమయంలో కణితితో బాధపడుతూ, దాని నుండి కోలుకుని ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ గర్భిణీ కడుపులో బాస్కెట్‌బాల్ సైజు కణితి పెరిగిపోయింది!

25 ఏళ్ల మహిళ గర్భం దాల్చిన 14 వారాలలో కడుపులో కణితి కనిపించింది. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించారు. ఇప్పుడు, అదే మహిళ ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మహిళ తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. గర్భధారణకు సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కూడా ఆమె పొత్తికడుపులో నిరపాయకరమైన కణితి కనిపించింది. ఆ తర్వాత ఆమెను ద్వారకలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అల్ట్రాసౌండ్ పరీక్షలో కణితి పెరుగుదల బయటపడింది. ప్రాథమిక స్కాన్‌లలో అండాశయ క్యాన్సర్ అనుమానాలు తలెత్తాయి. మరింత లోతుగా పరీక్షించిన వైద్యులు.. చాలా కష్టపడ్డారు. గర్భంలో శిశువు ఉన్నందున తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం దృష్ట్యా చికిత్సలను మరింత జాగ్రత్తగా నిర్వహించారు. గర్భధారణ దశలో అరుదైన, అధిక-ప్రమాదకర శస్త్రచికిత్స చేయాలని వైద్య బృందం నిర్ణయించింది.
శస్త్రచికిత్స ద్వారా కణితి తొలగింపు! రోగికి ఓపెన్ సర్జరీ జరిగింది. దీనిలో కణితిని, ప్రభావితమైన అండాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌ను తొలగించారు. అదే శస్త్రచికిత్స సమయంలో వైద్యులు క్యాన్సర్ వ్యాప్తిని అంచనా వేశారు. గర్భధారణను రక్షించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ కేసు గురించి ద్వారకలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని గైనే సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సరిత కుమారి మాట్లాడుతూ…గర్భధారణ సమయంలో కణితులు వచ్చే కేసులు చాలా అరుదు అయినప్పటికీ, సకాలంలో రోగ నిర్ధారణ, జాగ్రత్తతో వాటిని సురక్షితంగా నిర్వహించవచ్చునని చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం మూడు రోజుల తర్వాత ఆ మహిళను ఇంటికి పంపించారు. ఆమె గర్భానికి సంబంధించి వారికి దగ్గర్లలోని వైద్యుల పర్యవేక్షణలో కొనసాగిందని చెప్పారు.
తుది పాథాలజీలో మహిళ పొత్తికడుపులోని కణితి అండాశయ సార్కోమా అని తేలింది. ఉదరంలోని ఇతర భాగాలకు వ్యాపించే సంకేతాలు లేవని వైద్యులు తెలిపారు. ఆ మహిళ ఇప్పుడు పూర్తి తొమ్మిది నెలలు నిండిన అనంతరం ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




