AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంపముంచిన చోలే భటూరే.. అదనపు చోలే అడిగినందుకు కత్తితో పొడిచి హత్య!

అదనంగా చోలే ఇవ్వాలని అడిగిన విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో కత్తులతో పలుమార్లు దాడికి గురైన 35 ఏళ్ల కారు డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడిని సందీప్‌గా గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చోలే భటూరే విక్రేత చింటూ గుప్తాను పోలీసులు అరెస్టు చేసి, న్యాయ కస్టడీకి తరలించారు. సందీప్ మృతి చెందడంతో కేసులో హత్యకు సంబంధించిన సెక్షన్‌ను కూడా చేర్చారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

కొంపముంచిన చోలే భటూరే.. అదనపు చోలే అడిగినందుకు కత్తితో పొడిచి హత్య!
Choley Bhature Dispute And Murder
Srilakshmi C
|

Updated on: Oct 29, 2026 | 6:32 PM

Share

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సందీప్ ఆదివారం జ్వాలాపురి నాలా సమీపంలోని వారపు సంతకు వెళ్లాడు. అక్కడ చోలే భటూరే విక్రేతను అదనంగా చోలే ఇవ్వాలని అడిగాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విక్రేత సందీప్‌ను దూషించడంతో వివాదం మరింత ముదిరి ఘర్షణకు దారితీసిందని సందీప్ తండ్రి బిజేందర్ సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో విక్రేత తన కుమారుడిపై పలుమార్లు కత్తితో దాడి చేశాడని తెలిపారు. దాడిలో సందీప్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అక్టోబర్ 25 రాత్రి తొలుత సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పంజాబీ బాగ్‌లోని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రికి మార్చారు. అయితే, రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సందీప్ మంగళవారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వైద్య-న్యాయ నివేదిక (MLC) ప్రకారం.. సందీప్ ఎడమ వైపు పొత్తికడుపుపై మూడు కత్తిపోట్లు ఉన్నాయి. ఎడమ ముంజేయిపై మూడు గాయాలతో పాటు మణికట్టుపై మరో గాయం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

సందీప్ గాయాల తీవ్రత, ఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించిన పోలీసులు తొలుత హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109(1) కింద ఆదివారం పశ్చిమ్ విహార్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణలో భాగంగా చింటూ గుప్తాను అరెస్టు చేసి న్యాయ కస్టడీకి తరలించారు. సందీప్ మరణించిన అనంతరం పోలీసులు కేసులో బీఎన్‌ఎస్ సెక్షన్ 103(1)ను చేర్చారు. ఈ సెక్షన్ హత్య నేరానికి సంబంధించినది. తన కుమారుడిపై జరిగిన దాడిలో ముగ్గురు లేదా నలుగురు పాల్గొన్నారని, అయితే పోలీసులు ఇప్పటివరకు ఆహార విక్రేతను మాత్రమే అరెస్టు చేశారని బిజేందర్ సింగ్ ఆరోపించారు. ఘటన గురించి తెలియగానే తాను అక్కడికి చేరుకున్నానని, కొందరు ప్రత్యక్ష సాక్షుల సహాయంతో కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అదనంగా కొంత చోలే అడగడమే నా కుమారుడు చేసిన తప్పు. అతడిపై పలుమార్లు కత్తితో దాడి చేశారు. రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరకు మృతి చెందాడు అని సందీప్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ గుర్తించి అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు. సందీప్ ఢిల్లీలోని నిహాల్ విహార్ పరిధిలో రావ్ విహార్ ప్రాంతంలో నివసిస్తూ ప్రైవేట్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్యతో పాటు నాలుగు, పది సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న సందీప్ మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

Follow Us