మరికొద్ది గంటల్లో పెళ్లి. అంతలోనే పెళ్లికూతురు ఫోన్‌కు ఓ అనుమానాస్పద మెయిల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసిన ఆమెకు గట్టి షాక్ తగిలింది. చివరి నిమిషంలో పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఇంతకీ అసలు ఆ మెయిల్‌లో ఏముంది.? ఎవరు పంపారు.? ఆ కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన అమూల్ గావ్లీ అనే యువకుడికి 2015లో మౌనిక(పేరు మార్చాం) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఆ యువకుడు.. మౌనికతో శారీరికంగా దగ్గరయ్యాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం సాగించారు. ఏడేళ్లుగా ఈ లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కొనసాగుతోంది. అయితే సదరు యువకుడు.. మౌనికకు తెలియకుండా ఈ ఏడాది జూన్‌లో స్వగ్రామానికి చేరుకొని.. చంద్రాపూర్‌కు చెందిన సంధ్య(పేరు మార్చాం) అనే యువతిని నిశ్చితార్ధం చేసుకున్నాడు. మౌనికను పూర్తిగా దూరం పెట్టాడు.
తన ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు అమూల్ దగ్గర నుంచి ఎలాంటి రిప్లయ్ రాకపోవడంతో మౌనికకు అనుమానం వచ్చింది. ఎంక్వయిరీ చేయగా.. అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని తెలుస్తుంది. తనకు జరిగిన అన్యాయానికి పోలీసులను ఆశ్రయిస్తుంది మౌనిక. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాని అమూల్‌ను మాత్రం అరెస్ట్ చేయలేదు. మరోవైపు అమూల్ ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. దీంతో తన జీవితం నాశనం అయినట్లు.. మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదనుకున్న మౌనిక సోషల్ మీడియా ద్వారా కాబోయే పెళ్లికూతురికి ఎఫ్‌ఐఆర్ కాపీని పంపించింది. దాన్ని చూసిన వధువు.. ఆమె తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించగా.. వారు ఇండోర్ పోలీసులను అడిగి తెలుసుకోవడంతో అసలు విషయం బయటపడింది. దీనితో చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ అయింది.