మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో పదేళ్ల బాలుడిని మొసలి మింగేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం చంబల్ నదిలో స్నానం చేస్తుండగా బాలుడిపై ఒక్కసారిగా భారీ మొసలి దాడి చేసింది. మొసలి బాలుడిని నదిలోకి లాక్కెళ్లింది. ఆ తర్వాత ఆ బాలుడిని మొసలి మింగేసింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు బాలుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కర్రలు, తాళ్లు, వలలతో స్థానికులంతా కలిసి మొసలిని పట్టుకుని ఒడ్డుకు లాకొచ్చారు.
కానీ మొసలి కడుపులో ఉన్న బాలుడిని ఎలా రక్షించాలి అనేది ఎవరికీ అర్థం కాలేదు. గ్రామస్తులు మొసలిని పట్టుకున్నారన్న సంఘటన గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గ్రామస్తుల బారి నుంచి మొసలిని రక్షించేందుకు ఇరు బృందాలు ప్రయత్నించాయి. అయితే సాయంత్రం వరకు బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. మొసలి కడుపులో తమ బిడ్డ బతికే ఉంటుందని పదేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు. మొసలి తమ బిడ్డను బయటకు పంపినప్పుడే వదిలేస్తామని వారు డిమాండ్ చేశారు. అయితే అసలు కడుపులో ఉన్న పిల్లవాడు బ్రతికి ఉండే అవకాశం లేదని తల్లిదండ్రులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొసలి మళ్ళీ నదిలోకి వెళ్లి పిల్లవాడిని బయటకు పంపించే అవకాశం లేదని, అలా కాదని మొసలిని చంపినా పిల్లవాడు బ్రతికి రాడని వారికి అర్థమయ్యేలా చెప్పారు. ఆపై అధికారుల చొరవతో ఎట్టకేలకు మొసలిని నదిలోకి వదిలిపెట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి