
భోపాల్, జనవరి 3: పాములంటే భయపడని వారుండరు. అల్లంత దూరంలో ఉండగానే ఇక్కడి నుంచే పరుగులంకించుకునే వాళ్లు మనలో చాలామందే ఉన్నారు. ఇలా పాములంటే భయం ఉండటాన్ని ఓఫిడియోఫోబియా అంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఉదయం పూట చలి మంట వద్ద వెచ్చగా చలి కాచుకుంటూ ఏకంగా బ్లాక్ కోబ్రాతో ‘చిట్-చాట్’ చేస్తూ కనిపించాడు. అంతేనా అతగాడి కబుర్లకు కోబ్రా కూడా పడగను ఊపుతూ అతని మాట వింటున్నట్లు తెగ సంబరపడిపోయింది. తలను అటూఇటూ ఊపుతూ చలిమంటను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఈ విచిత్ర సంఘటన చోటు శుక్రవారం (జనవరి 2) చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారియి. వివరాల్లోకెళ్తే..
ఈ వీడియోలో ఒక వ్యక్తి చలిమంట దగ్గర ప్రశాంతంగా కూర్చుని మంట కాచుకుంటూ కనిపించాడు. అయితే అతడి పక్కన నల్లతాచు పాము పడగవిప్పి ఉండటం కనిపించింది. తాచుపాము కూడా మంటకు వెచ్చగా చలి కాచుకోవడానికి వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి తన పక్కనే తిష్టవేసిన నాగరాజుతో మాట కలిపాడు. కాస్త ప్రశాంతంగా ఉండమని, కాటు వేయవద్దని అడిగాడు. దీంతో పాము కూడా పడగను అటూఇటూ ఊపుతూ ‘ఆ.. వేయనులే’ అన్నట్లు సమాధానం ఇవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు. భయం ఏం లేదు. ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటా.. చక్కగా విశ్రాంతి తీసుకొని చలిమంట వెచ్చదనాన్ని ఆస్వాదించమని కోబ్రాకు కబుర్లు చెప్పాడు.
#WATCH | Man Caught In A Hilarious Conversation With #Snake In #Chhatarpur; Video Goes Viral#MadhyaPradesh #MPNews #wildlife pic.twitter.com/FiwLcJq47H
— Free Press Madhya Pradesh (@FreePressMP) January 2, 2026
ఆ వ్యక్తి మాటలకు ప్రతిస్పందిస్తున్నట్లుగా పాము కూడా తన పడగను కదిలించడం వీడియోలో కనిపిస్తుంది. ఇక వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. ఇంకేముంది నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. బ్రో.. అదేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా? పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెబుతున్నావ్? అని ఒకరు, బ్లాక్ కోబ్రాతో చిట్‌చాట్ అని మరొకరు, అయ్ బాబోయ్ వీడెవడో గుండెలు తీసిన బంటులా ఉన్నాడు.. బ్లాక్ కోబ్రాతో యవ్వారం పెట్టాడు అంటూ ఇంకొకరు సరదాగా కామెంట్ సెక్షన్‌లో జోకులు పేలుస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు..?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.