
నంది కొండలు.. బెంగళూరు నుంచి కొద్దిదూరంలో ఉన్న ఈ ప్రాంతం లవర్స్‌కు ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. ప్రతీ వీకెండ్‌లో ఆ ప్రాంతమంతా ఎక్కడ చూసినా జంటలే కనిపిస్తారు ఇక ఆ ప్రాంతానికి సమీపాన ఓ పురాతన భోగనందీశ్వర శివాలయం ఉంది. నంది కొండలు వెళ్లే చాలామంది ఆ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఆ ఆలయ సిబ్బంది తాజాగా హుండీ లెక్కింపు చేపట్టగా వారికి షాక్ ఇస్తూ చిత్రవిచిత్రమైన ప్రేమ లేఖలు బయటపడ్డాయి. దాదాపుగా 15 లక్షల రూపాయల కానుకలతో పాటు డిమాండ్ లెటర్స్, లవ్ లెటర్స్, దేవుడికి అభ్యర్ధన పత్రాలు సిబ్బందికి కనిపించాయి. అంతేకాదు హుండీలో ఓ మహిళ ఫోటో.. దాని వెనుక ‘పద్మా.. మళ్ళీ తిరిగి రా!’ అంటూ రాసిన ఓ ప్రేమ లేఖ కూడా దర్శనమిచ్చింది.
మరొక లేఖలో, ‘దేవుడా, నేను ప్రేమించే అమ్మాయి తల్లిదండ్రులు మా పెళ్లి ఒప్పుకునేలా చెయ్యి. నేను ఆమెను చాలా బాగా చూసుకుంటాను, ఎలాంటి సమస్యలు లేకుండా ఆమెను అంగీకరించేలా చేయి’ అని రాసి ఉంది. మరొక లేఖలో, ‘నా భర్తకు మంచి ఉద్యోగం రావాలి, నా కొడుకు బాగా చదువుకోవాలి’ అని రాసి ఉంది. కాగా, ఈ లెటర్స్‌పై ఆలయ సిబ్బంది స్పందించింది. ‘కొంతమంది భక్తులు తమ డిమాండ్లను కానుకలతో పాటు లిఖితపూర్వకంగా సమర్పించినట్లు తేలింది. కొంతమంది భక్తులు రాసిన లెటర్స్ కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కానీ వారికి అవి చాలా ముఖ్యమైనవి కావచ్చు. అలాగే హుండీలో తక్కువ పరిమాణంలో బంగారం, వెండి కూడా లభించాయి’ అని పేర్కొంది.