తాన్‌సేన్ పాడితే నిజంగా వానలు పడేవా.. సంగీతంతో ప్రకృతిని శాసించొచ్చా? చరిత్ర చెప్పని అసలు వాస్తవాలు ఇవే..
దేశంలో వర్షాల ప్రస్తావన రాగానే మనకు చరిత్రలో విన్న ఒక అద్భుతమైన ఘట్టం గుర్తొస్తుంది... అదే, సంగీత సామ్రాట్ తాన్‌సేన్ తన రాగంతో వర్షం కురిపించారనే కథ.. ఆయన మేఘ మల్హార్ రాగాన్ని ఆలాపిస్తే ఆకాశం నుండి వర్షం కురిసేదని, దీపక్ రాగం పాడితే దీపాలు వెలిగేవని మనం వింటూనే ఉంటాం. అసలు ఈ కథల వెనుక ఉన్న నిజమేంటి? అనేది తెలుసుకుందాం..

శాస్త్రీయ హిందుస్థానీ సంగీతంలో తాన్‌సేన్ పేరు చాలా గొప్పది. గ్వాలియర్‌లో జన్మించిన ఆయన, చిన్న వయసులోనే సంగీత సాధన చేసి, మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరిగా స్థానం సంపాదించారు. అక్బర్ ఆయన్ని మియాన్ అనే బిరుదుతో సత్కరించారు. అయితే తాన్‌సేన్ గురించి తరతరాలుగా చెప్పుకునే అత్యంత ప్రసిద్ధమైన కథ ఏంటంటే.. ఆయన మేఘ మల్హార్ రాగాన్ని ఆలాపిస్తే ఆకాశం నుండి వర్షం కురిసేదని, అలాగే దీపక్ రాగం పాడితే దీపాలు వెలిగేవని. కానీ, ఈ కథలను అటు సైన్స్, ఇటు హిస్టరీ నిజమేనని ఒప్పుకుంటున్నాయా? అనేది చాలా మందికి తెలియవు. రాగం పాడితే వర్షం రావడం, దీపాలు వెలగడం వంటి కథలు మన జానపద కథలు, ప్రాంతీయ గాథల్లో ఒక భాగంగా మారిపోయాయి. తాన్‌సేన్‌కు కొన్ని అసాధారణ శక్తులు ఉన్నట్లు, ఆయన తన సంగీతంతో ప్రకృతిని శాసించినట్లు ఈ కథల్లో చూపిస్తారు. కాలక్రమేణా ఈ కథలకు మరిన్ని కల్పిత రంగులు అద్దడంతో, ఇవి సమాజంలో బలమైన నమ్మకాలుగా మారిపోయాయి.
రాగాలకు, వాతావరణానికి ఉన్న సంబంధం ఏంటి?
హిందుస్థానీ సంగీతంలో కొన్ని రాగాలను కొన్ని నిర్దిష్ట రుతువులతో ముడిపెడతారు. ఉదాహరణకు మేఘ, మల్హార్ రాగాలు వర్ష కాలానికి ప్రతీకలు. ఈ రాగాలను విన్నప్పుడు మనసుకు వర్షాన్ని, రుతుపవనాలను తలపించే ఒక భావోద్వేగ అనుభూతి కలుగుతుంది. ఇది పూర్తిగా మానసిక, సాంస్కృతిక సంబంధమే తప్ప, ఒక రాగాన్ని పాడటం వల్ల నేరుగా మేఘాలు కరిగి వర్షం పడుతుందనడానికి ఎటువంటి భౌతిక ఆధారం లేదు.
చారిత్రక ఆధారాలు ఏమంటున్నాయి?
ఆధునిక చరిత్రకారులు, శాస్త్రీయ గ్రంథాలు తాన్‌సేన్ అద్భుతమైన కళా ప్రతిభను ముక్తకంఠంతో శ్లాఘిస్తాయి. కానీ, అక్బర్ ఆస్థానంలోని సమకాలీన చరిత్రకారులు రాసిన అధికారిక రికార్డులలో ఎక్కడా.. తాన్‌సేన్ వాతావరణాన్ని నియంత్రించాడని లేదా రాగంతో వానలు కురిపించాడనే అద్భుతాల గురించిన ప్రస్తావన, స్పష్టమైన ఆధారాలు గానీ లేవు. ఇవన్నీ ఆయన మరణించిన చాలా కాలం తర్వాత వచ్చిన కథల్లోనే కనిపిస్తాయి. కాబట్టి చరిత్రకారులు వీటిని కేవలం ఒక కళాకారుడి గొప్పదనాన్ని వర్ణించడానికి వాడిన ప్రతీకలుగానే చూస్తారు.
వైజ్ఞానిక దృక్కోణం
సైన్స్ ప్రకారం.. వర్షం పడటానికి వాతావరణంలో అనేక రసాయన, భౌతిక ప్రక్రియలు జరగాలి. నీటి ఆవిరి, ఘనీభవనం, మేఘాల సాంద్రత వంటివి ముఖ్యం. మనుషుల గొంతు నుండి వచ్చే ధ్వని తరంగాలు మేఘాలలో నీటి బిందువులను సృష్టించి వర్షం కురిపించలేవు. ఈ రోజుల్లో సైన్స్ సాయంతో క్లౌడ్ సీడింగ్ కురిపిస్తున్నారు కానీ, దానికి కూడా సాంకేతికత, అనుకూల వాతావరణం అవసరం. కేవలం ఒక వ్యక్తి గానంతో వాతావరణాన్ని మార్చడం సైన్స్ ప్రకారం పూర్తిగా అసాధ్యం.
సినిమాలు, సాహిత్యంతో పెరిగిన మాయాజాలం..
తాన్‌సేన్ కథలు నోటి మాటగా ప్రచారమవుతూ, ఆ తర్వాత నాటకాలు, సినిమాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. 1943 నాటి తాన్‌సేన్ సినిమాలో తాన్‌సేన్ రాగ మల్హార్ పాడగానే నాటకీయంగా వర్షం పడే దృశ్యాన్ని చూపించారు. 1952 నాటి బైజూ బావ్రా సినిమాలో కూడా కరువు సమయంలో రాగ మల్హార్ పాడి వర్షం తెప్పించినట్లు చూపించారు. ఇవి సినిమా కథకు, నాటకీయతకు అద్భుతంగా సరిపోయాయి. అయితే ఏదైనా ఒక సంగీత కచేరీ వర్షం పడే సమయంలో జరిగి ఉండవచ్చని, ఆ యాదృచ్ఛిక ఘటనను జనాలు సంగీత మహిమగా భావించి ఉండవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.
జనశ్రుతి ప్రకారం తాన్‌సేన్ రాగంతో వర్షం కురిపించారనే కథ వినడానికి ఎంతో గొప్పగా, మన సంస్కృతి పట్ల గర్వంగా అనిపిస్తుంది. ఒక కళాకారుడి ప్రతిభను గౌరవించడానికి, సంగీతం గొప్పదనాన్ని చాటడానికి ఈ కథలు అద్భుతమైన సాధనాలు. కానీ, వీటిని కథలుగా ఆస్వాదించాలే తప్ప.. శాస్త్రీయ లేదా చారిత్రక సత్యాలుగా భావించడం మాత్రం సరికాదు.
