యువకుడిపై చేప దాడి..! ముక్కుతో కడుపులో బలంగా పొడవడంతో మృతి..
అరేబియా సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన అక్షయ్‌ను పదునైన ముక్కు గల చేప కడుపులో గాయపరిచింది. ఆసుపత్రిలో సరైన చికిత్స అందలేదని ఆరోపణలున్నాయి. చివరకు అతను మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు.

చేపలు పట్టడం అతని వృతి. పట్టిన చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతోనే తన కుటుంబం గడవాలి. అయితే అదే వృత్తి ఇప్పుడా యువకుడి ప్రాణం తీసింది. చేపల వేటకు వెళ్లిన సమయంలో ఓ చేప దాడి చేయడంతో యువకుడి మరణించాడు. ఈ విషాద ఘటన అరేబియా సముద్ర తీరంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్‌లోని మజాలిలోని దండేబాగాకు చెందిన అక్షయ్ అనిల్ మజాలికర్ అనే యువకుడు చేప దాడిలో మరణించాడు. అరేబియా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు ఈ విషాదం జరిగింది. చేప దాడి చేసి ఆసుపత్రికి తరలించిన అక్షయ్‌కు వైద్యులు సరైన చికిత్స అందించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి.
అక్టోబర్ 14న అక్షయ్ లోతైన సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. అతను పడవలో ఉండగా 8 నుండి 10 అంగుళాల పొడవున్న పదునైన ముక్కు గల చేప నీటిలో నుండి దూకి అక్షయ్ కడుపులో కరిచింది. అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు, వెంటనే కార్వార్‌లోని క్రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 రోజుల చికిత్స తర్వాత వైద్యులు గాయానికి కుట్లు వేసి డిశ్చార్జ్ చేశారు. అయితే నొప్పి పునరావృతం కావడంతో అతన్ని మళ్ళీ ఆసుపత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు ఎటువంటి చికిత్స లేకుండా గురువారం (అక్టోబర్ 16) ఉదయం 5 గంటలకు అతను మరణించాడు.
అక్షయ్ మరణ వార్త తెలియగానే వందలాది మంది మత్స్యకారులు కిమ్స్ ఆసుపత్రి సమీపంలో గుమిగూడి, వైద్యుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కన్నడ జిల్లా దశాబ్ద కాలంగా హైటెక్ ఆసుపత్రి కోసం ఇబ్బంది పడుతోంది. ఈ మధ్యలో సరైన చికిత్స అందక ఒక జాలరి మరణించడం నిజంగా విషాదకరమని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
