ఉండవెళ్లి మండలంలోని బొంకూరులో వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించిన వాహనదారులకి షాకింగ్ సీన్ ఎదురైంది. స్థానికంగా ఉన్న కేజీఎస్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించిన 10 మంది వాహనదారుల బైకులు..ఉన్నట్టుండి మార్గమధ్యలోనే ఆగిపోయాయి. దాంతో వాహనదారులకు ఏం అర్థంకాలేదు..బండేందుకు ఆగిపోయిందో తెలియక.. మెకానిక్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించగా అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు..బండిలో పెట్రోల్ కి బదులు వాటర్ ఉండటాన్ని చూసి వాహనదారులు అవాక్కయ్యారు. తిరిగి పెట్రోల్ బంకుకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. పెద్ద సంఖ్యలో బంక్‌పై దాడికి దిగిన వాహనదారులు ఆందోళన చేపట్టారు. ఖాళీ బాటిల్స్, బకెట్లలో పెట్రోల్ పట్టి అధికారులకు ఫిర్యాదు చేశారు.
వాహనదారుల ఆందోళనతో పొరపాటును గ్రహించిన బంకు సిబ్బంది, పెట్రోల్ ను ఫిల్ చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. తప్పిదం కారణంగా ఆగిపోయిన వాహనాలను రిపేర్ చేయిస్తామని బంకు యజమాన్యం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వాహనదారులు కొంతవరకూ శాంతించారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వాహనదారులు మండిపడ్డారు. అయితే, పెట్రోల్ బంకు యాజమాన్యం మాత్రం పెట్రోల్ లో ఎలాంటి నీటిని కల్తీ చేయలేదని, వర్షాల దృష్ట్యా ఇలా ఇంకిపోయి ఉంటాయని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి