Instagram: ఇండియన్స్ ఎక్కువగా ఎటువంటి రీల్స్ చూస్తున్నారో తెలుసా..? సర్వేలో ఊహించని నిజాలు..
మీరు రోజులో ఎంత సమయం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ గడుపుతారు? అసలు రీల్స్ ఓపెన్ చేయగానే మీ స్క్రీన్ పైకి ఎలాంటి వీడియోలు ఎక్కువగా వస్తుంటాయి? దీనిపై నెటిజన్ల మైండ్ వాయిస్ ఏంటో చెబుతూ ఒక ప్రముఖ రీసెర్చ్ సంస్థ సంచలన నివేదికను విడుదల చేసింది. మన దేశంలో మెజారిటీ ప్రజలు ఏ రీల్స్ ఎక్కువ చూస్తున్నారంటే..?

దేశంలో రీల్స్‌ను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖాళీ సమయం దొరికితే చాలు.. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ మునిగిపోతున్నారు. అయితే అసలు ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు? వారిపై రీల్స్ ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన సంచలన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
టాప్ ప్లేస్‌లో బ్యూటీ – ఫ్యాషన్.. కామెడీకి ఏ స్థానమంటే?
ఈ తాజా నివేదిక ప్రకారం.. భారతీయ వీక్షకులను అందం, మేకప్, ఫ్యాషన్, లేటెస్ట్ లైఫ్‌స్టైల్ ట్రెండ్స్‌కు సంబంధించిన వీడియోలు అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. సర్వేలో తేలిన ఆసక్తికరమైన గణాంకాలు ఇవే..
బ్యూటీ – ఫ్యాషన్ (52శాతం): సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా తాము క్రమం తప్పకుండా ఫ్యాషన్, మేకప్ కంటెంట్‌నే చూస్తామని తేల్చి చెప్పారు.
కామెడీ (39శాతం): ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం 39 శాతం మంది కామెడీ మరియు ఫన్నీ వీడియోలను ఇష్టపడుతున్నారు.
స్పోర్ట్స్ (38శాతం): క్రీడలకు సంబంధించిన అప్‌డేట్స్, షార్ట్ క్లిప్స్ చూసేందుకు 38 శాతం మంది మొగ్గు చూపారు.
ట్రావెల్ (37శాతం): కొత్త ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేసే ట్రావెల్ రీల్స్‌ను 37 శాతం మంది వీక్షిస్తున్నారు.
క్రియేటర్లకు కాసుల కురిపిస్తున్న రీల్స్..
ఇతర షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కంటెంట్ క్రియేటర్లకు భారీ స్థాయిలో ఎంగేజ్‌మెంట్ అందిస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇక్కడ వీక్షకులు కేవలం వీడియోలు చూసి వదిలేయడం లేదు. విపరీతంగా లైక్ చేయడం, కామెంట్లు పెట్టడం, తమ ఫ్రెండ్స్‌కు షేర్ చేయడంతో పాటు రీషేర్ కూడా చేస్తున్నారు. అందుకే బ్రాండ్లు కూడా క్రియేటర్లను ఆశ్రయించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి.
కేవలం టైంపాస్ కాదు.. షాపింగ్ గైడ్ కూడా.
రీల్స్ అంటే కేవలం వినోదం, టైంపాస్ అనుకుంటే పొరపాటే. అవి ఇప్పుడు ప్రజల కొనుగోలు నిర్ణయాలను కూడా శాసిస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చే కొత్త ప్రొడక్ట్స్, బ్రాండ్ల గురించిన మొదటి సమాచారాన్ని తాము రీల్స్ ద్వారానే తెలుసుకుంటున్నామని మెజారిటీ యూజర్లు ఒప్పుకున్నారు. ఏదైనా వస్తువు కొనే ముందు దానికి సంబంధించిన రీల్స్ రివ్యూలు చూడటం ఇప్పుడు కామన్ అయిపోయింది. దీంతో ఇ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్‌లో రీల్స్ ఒక మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్‌గా మారాయి.
జెన్ జెడ్- గ్రామీణ భారతంపై రీల్స్ మాయ..
సర్వేలో మరో రెండు కీలక విషయాలు బయటపడ్డాయి.
జెన్ జెడ్ హవా: నేటి యువతరం నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ప్రతిరోజూ రీల్స్‌తో గడుపుతున్నారు. వారికి సమాచారం, వినోదం, షాపింగ్ ఐడియాలకు రీల్స్ ఒక ప్రధాన వనరుగా మారాయి.
గ్రామాల్లోనూ క్రేజ్: షార్ట్ వీడియోల ప్రభావం కేవలం మెట్రో నగరాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. గ్రామీణ భారతదేశంలో కూడా మెటా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సరికొత్త బ్రాండ్లు, ప్రొడక్ట్స్ గురించిన సమాచారం వేగంగా విస్తరిస్తోందని ఈ సర్వే స్పష్టం చేసింది.
