బంగారం కంటే ఖరీదైన విషం.. పాములతో కోట్లు సంపాదిస్తున్న ఆ ఊరు గురించి తెలుసా..?
ప్రపంచమంతా పాములను చూసి ప్రాణభయంతో పారిపోతుంటే.. చైనా మాత్రం వాటిని జీవనాధారంగా మార్చుకుని వరల్డ్ మార్కెట్‌ను శాసిస్తోంది. అక్కడి గ్రామాల్లో పాములను పెంచడం కాసుల వర్షం కురిపిస్తుంది. కీళ్ల నొప్పుల మందుల నుండి క్యాన్సర్ చికిత్స వరకు.. పాములోని ప్రతి భాగాన్ని చైనీయులు ఎలా డబ్బుగా మారుస్తున్నారు? అసలు ఈ స్నేక్ విలేజ్‌ల వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? అనేది తెలుసుకుందాం..

సాధారణంగా పాము పేరు చెబితేనే ఎవరైనా ఆమడదూరం పరుగెడుతుంటారు. కానీ చైనాలోని కొన్ని గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ పాములు ప్రమాదకరమైన జీవులు కావు.. కోట్లు కురిపించే జీవనాధారాలు. కొన్ని ప్రాంతాలైతే ఏకంగా స్నేక్ విలేజ్‌లుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. పాములను పెంచుతూ చైనా అంతర్జాతీయ మార్కెట్‌ను ఏ విధంగా శాసిస్తుందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.
బంగారం కంటే విలువైన విషం
వైద్య రంగంలో పాము విషానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక గ్రాము పాము విషం ధర బంగారం కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనిని ప్రాణరక్షక ఔషధాల తయారీలో, ముఖ్యంగా క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. చైనా ఫారాల్లో పెంచే పాముల నుండి నెలకు రెండుసార్లు విషాన్ని సేకరించి భారీ ధరలకు వేలం వేస్తారు. ఇదే ఈ పరిశ్రమకు అసలైన జాక్‌పాట్.
చైనీస్ మెడిసిన్‌లో గోల్డ్ లాంటిది..
కేవలం విషమే కాదు పాములోని ప్రతి భాగానికి చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. పాము చర్మం, ఎముకలను సాంప్రదాయ చైనీస్ వైద్యంలో కీళ్లవాతం, చర్మ వ్యాధుల చికిత్సకు వీటిని ఉపయోగిస్తారు. పాము నూనెను కీళ్ల నొప్పుల నివారిణిగా దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. చైనీస్ రెస్టారెంట్లలో పాము మాంసం ఒక విలాసవంతమైన వంటకం. ఇది పెంపకందారులకు అదనపు ఆదాయ వనరుగా మారింది.
కోట్లలో లాభాలు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
చైనాలోని ఒక మధ్య తరహా పాముల పెంపకం కేంద్రం ద్వారా యజమానులు ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల వరకు లాభం ఆర్జిస్తున్నారంటే ఈ బిజినెస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి సరైన లైసెన్సులు, అనుమతులతో నడుస్తున్న ఈ ఫారాలు చైనా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చేశాయి.
మృత్యువుతో ముఖాముఖి..
ఈ వ్యాపారంలో లాభాలు ఎంత ఎక్కువగా ఉంటాయో, ప్రాణాపాయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. పాములకు ఆహారం అందించడం, బోనులు శుభ్రం చేయడం వంటి ప్రతి క్షణం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విషం సేకరించే సమయంలో జరిగే చిన్న పొరపాటు కూడా మరణానికి దారితీయవచ్చు. కానీ చైనా ప్రజలు తరతరాలుగా ఈ విద్యలో ఆరితేరారు. భయాన్ని వదిలి, ప్రమాదకరమైన పాములను పట్టుకుని ప్రపంచ మార్కెట్‌ను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రమాదాన్ని వ్యాపారంగా మార్చుకున్న ఈ స్నేక్ విలేజ్‌ల కథ నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
