AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..

మనం పుట్టకముందే, అమ్మ గర్భంలో ఉన్నప్పుడే రూపుదిద్దుకునే మన వేలిముద్రల వెనుక ఒక పెద్ద కథే ఉంది. చెట్టు కొమ్మను పట్టుకోవాలన్నా, కళ్లు మూసుకుని వస్తువును గుర్తించాలన్నా ఇవే మనకు ఆధారం. ఇప్పుడైతే మన గుర్తింపుకు ఇదే అతిపెద్ద ఆధారం.. వేల ఏళ్ల నాటి మానవ చరిత్రను తనలో దాచుకున్న ఆ వేలిముద్రల చరిత్ర గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
Why Do We Have Fingerprints
Krishna S
|

Updated on: Apr 23, 2026 | 3:14 PM

Share

ఫోన్ అన్‌లాక్ చేయాలన్నా, ఆఫీసులో అటెండెన్స్ వేయాలన్నా, ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ ధ్రువీకరణ కావాలన్నా.. మన వేలిముద్ర అత్యంత కీలకంగా మారింది. అయితే ఈ సూక్ష్మ రేఖలు కేవలం మనల్ని గుర్తించడానికి మాత్రమే ఏర్పడ్డాయని మీరు అనుకుంటున్నారా.? కానే కాదు.. మన వేలిముద్రల వెనుక లక్షలాది సంవత్సరాల మానవ పరిణామ క్రమం, మనుగడ కోసం జరిగిన పోరాటం దాగి ఉంది. శాస్త్రీయ కోణంలో చూస్తే.. వేలిముద్రలు ప్రధానంగా మనకు పట్టు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మన పూర్వీకులు చెట్లు ఎక్కేటప్పుడు లేదా జారిపోయే వస్తువులను పట్టుకోవాల్సి వచ్చినప్పుడు, ఈ గీతలు ఘర్షణను పెంచి చేయి జారిపోకుండా కాపాడేవి.

 అద్భుతమైన స్పర్శ జ్ఞానం

మన చేతులకు నీరు తగిలినప్పుడు, ఈ గీతల మధ్య ఉండే గాడులు నీటిని బయటకు పంపిస్తాయి. దీనివల్ల తడి ఉపరితలాలపై కూడా మనం వస్తువులను సులభంగా పట్టుకోగలుగుతాము. వేలిముద్రలు కేవలం పట్టునే కాదు, అద్భుతమైన స్పర్శ జ్ఞానాన్ని కూడా అందిస్తాయి. ఒక వస్తువు ఎంత మృదువుగా ఉంది లేదా ఎంత గరుకుగా ఉందనే విషయాన్ని ఈ రేఖల ద్వారా కలిగే కంపనాలు మన మెదడుకు చేరవేస్తాయి. అందుకే కళ్లు మూసుకుని కూడా మనం వస్తువులను గుర్తించగలం.

తల్లి గర్భంలోనే ఆరంభం

వేలిముద్రల గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇవి మనం పుట్టకముందే, అంటే తల్లి గర్భంలో ఉన్న 10వ వారం నుండే ఏర్పడటం మొదలవుతాయి. శిశువు పెరుగుతున్నప్పుడు చర్మం పొరల మధ్య కలిగే ఒత్తిడి, రక్త ప్రసరణ, గర్భాశయంలోని ద్రవాల కదలికల వల్ల ఈ ప్రత్యేకమైన డిజైన్లు రూపుదిద్దుకుంటాయి. ఈ భూమి మీద సుమారు 800 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ.. ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. చివరికి ఒకే పిండం నుండి పుట్టిన కవలల వేలిముద్రలు కూడా భిన్నంగానే ఉంటాయి. జన్యువులు ఒకేలా ఉన్నా, గర్భంలో వారి చర్మం అభివృద్ధి చెందే తీరులో ఉండే స్వల్ప మార్పులే ఇందుకు కారణం.

అడవి నుండి ఆధునిక భద్రత వరకు..

ఒకప్పుడు అడవిలో క్రూర మృగాల నుండి తప్పించుకోవడానికి, ఆహారాన్ని వేటాడటానికి మనకు సహకరించిన ఈ వేలిముద్రలు.. నేడు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బయోమెట్రిక్ భద్రతా వ్యవస్థగా మారాయి. నేర పరిశోధనలో పోలీసులకు సాక్షిగా, అంతర్జాతీయ సరిహద్దుల్లో గుర్తింపు కార్డుగా ఇవి విశేష సేవలు అందిస్తున్నాయి. ఇలా ప్రకృతి మనకు ఇచ్చిన ఈ చిన్న రేఖలు, మన వ్యక్తిత్వానికి, మనుగడకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Follow Us