
హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR) అంటేనే వాహనాలు గాలి వేగంతో దూసుకెళ్లే రహదారి. అలాంటి ప్రమాదకరమైన రోడ్డుపై ఒక కారు యజమాని చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. కారు లోపల సీట్లు ఖాళీగా లేవో లేక సరదా కోసం చేశారో తెలియదు కానీ, ఏకంగా కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి ప్రయాణించిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాల మధ్య ఈ దృశ్యం అత్యంత ప్రమాదకరంగా ఉంది. అసలేం జరిగింది..?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక తెల్లటి కారు ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తోంది. ఆ కారు డిక్కీ తలుపు సగం తెరిచి ఉండగా, లోపల ముగ్గురు చిన్న పిల్లలు కూర్చుని ఉన్నారు. కారు వేగంగా వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ, వాహనం నడుపుతున్న వ్యక్తి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో వెనుక వస్తున్న మరో కారులోని ప్రయాణికులు ఈ భయంకర దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో సైబరాబాద్ పోలీసులు తక్షణమే స్పందించారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాన్ని గుర్తించి, యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పసిపిల్లల ప్రాణాలను పణంగా పెట్టిన ఇలాంటి చర్యలను సహించేది లేదు అని పోలీసులు పేర్కొన్నారు. బాధ్యులకు భారీ జరిమానాతో పాటు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల వేగం గంటకు 100 నుండి 120 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా అది ఘోర ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి సమయంలో పిల్లలను డిక్కీలో కూర్చోబెట్టడం అనేది అజ్ఞానమే కాకుండా నేరం కూడా. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రయాణాల్లో భద్రత అనేది ప్రాథమిక సూత్రం. వాహనం నడిపేటప్పుడు కేవలం ట్రాఫిక్ నిబంధనల కోసమే కాకుండా, మన కుటుంబ సభ్యుల ప్రాణాల కోసం జాగ్రత్తలు పాటించాలి. ఈ ఘటనపై పోలీసులు స్పందించిన తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..