AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా.. 170ఏళ్ల మిస్టరీ..

చీరల మడతల నుంచి చిరిగిన బట్టల వరకు.. ప్రతి ఇంట్లో కనిపించే సేఫ్టీ పిన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కేవలం 15 డాలర్ల అప్పు తీర్చడం కోసం ఒక వ్యక్తి చేసిన చిన్న ఆలోచన.. ప్రపంచాన్నే మార్చేసిన మిలియన్ డాలర్ల ఆవిష్కరణగా ఎలా మారింది? 170 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చిన్న పిన్ కథ వింటే నిజంగా ఆశ్చర్యపోతారు.

అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా.. 170ఏళ్ల మిస్టరీ..
Who Invented The Safety Pin
Krishna S
|

Updated on: Aug 14, 2026 | 5:45 PM

Share

రోజువారీ జీవితంలో అత్యంత సాధారణంగా కనిపించే వస్తువులలో సేఫ్టీ పిన్ ఒకటి. చీరల మడతలు సరిచేయడం దగ్గరి నుంచి అత్యవసర సమయాల్లో దుస్తులు జారిపోకుండా ఆపడం వరకు ప్రతి ఇంటా దీని పాత్ర ప్రత్యేకం. పైకి అతి సాధారణమైన, చవకైన లోహపు వస్తువుగా కనిపించినా.. దీని వెనుక 170 ఏళ్లకుపైగా చరిత్ర, ఎంతో నిశితమైన మెకానికల్ ఇంజనీరింగ్ సూత్రాలు దాగి ఉన్నాయి. ఆధునిక సేఫ్టీ పిన్ ఆవిష్కరణ అనుకోకుండా జరిగిన ఒక అద్భుతం. 1849లో అమెరికాకు చెందిన మెకానిక్ వాల్టర్ హంట్ తన స్నేహితుడికి ఇవ్వాల్సిన 15 డాలర్ల అప్పు తీర్చేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆ క్రమంలో చేతిలో ఉన్న సుమారు 8 అంగుళాల పొడవైన ఇత్తడి తీగను అటూఇటూ మెలితిప్పుతూ కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఒక సరికొత్త రకం పిన్‌ను రూపొందించాడు. 1849 ఏప్రిల్ 10న దీనికి పేటెంట్ లభించగా.. అప్పు తీర్చుకోవడం కోసం ఆ పేటెంట్ హక్కులను కేవలం 400 డాలర్లకే డబ్ల్యూ.ఆర్.గ్రేస్ కంపెనీకి అమ్మేశాడు. అయితే ఆ తర్వాత ఆ కంపెనీ ఈ పిన్ల తయారీ ద్వారా మార్కెట్లో మిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది.

ప్రాచీన కాలంలోనూ..

ఆధునిక స్ప్రింగ్ పిన్‌ను వాల్టర్ హంట్ అభివృద్ధి చేసినప్పటికీ.. దీని మూలాలు ప్రాచీన యుగంలోనే ఉన్నాయి. పురాతన గ్రీక్, రోమన్, మైసీనియన్ సంస్కృతుల్లో దుస్తులను బిగించేందుకు ఫిబులా అనే లోహపు పిన్లను ఉపయోగించేవారు. ఆ ప్రాచీన రూపానికి ఆధునిక సైన్స్ జోడించి, వినియోగదారులకు సూది గుచ్చుకోకుండా ఉండేలా హంట్ చేసిన మార్పులే ప్రస్తుత సేఫ్టీ పిన్‌కు ప్రాణం పోశాయి.

ఈ పరికరంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. పిన్ అడుగుభాగంలో ఉండే గుండ్రని లూప్ స్థిరమైన ఒత్తిడిని కలిగించే స్ప్రింగ్‌లా పనిచేస్తుంది. ఇక దుస్తుల్లోకి సులభంగా చొచ్చుకుపోయే పదునైన సూది అంచును ఒక చిన్న క్యాప్ లోపల దాచేలా లాకింగ్ వ్యవస్థను రూపొందించారు. స్ప్రింగ్ ఇచ్చే ఒత్తిడి వల్ల సూది ఆ క్యాప్‌లో స్థిరంగా లాక్ అయి ఉంటుంది. దీనివల్ల వాడే వ్యక్తికి సూది గుచ్చుకుని గాయాలయ్యే ప్రమాదం చాలా తక్కువ. అందుకే దీనికి సేఫ్టీ పిన్ అనే పేరు వచ్చింది.

సాంకేతిక రంగం రోజురోజుకూ ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నా, 170 ఏళ్ల క్రితం వాల్టర్ హంట్ గీసిన అసలు డిజైన్‌లో ఇప్పటివరకు ఒక్క చిన్న మార్పు కూడా చేయాల్సిన అవసరం రాలేదు. అతి తక్కువ ఖర్చుతో ఇంతటి పకడ్బందీ భద్రతను, సరళమైన మెకానిజాన్ని అందించే మరొక ఆవిష్కరణ మానవ చరిత్రలో అరుదని పరిశోధకులు కొనియాడుతుంటారు.

Follow Us