
పార్క్ చేసిన కార్లు, బైక్‌లను చోరీ చేసిన ఘటనలు పెరుగుతున్నాయి. లాకింగ్ సిస్టమ్ ఉన్న ఏ వాహనమైనా క్షణాల్లో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. అదేవిధంగా పార్క్ చేసిన కారును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు.. కారు నడుపుతూ పారిపోతుండగా అతనికి ఊహించని సీన్ ఎదురైంది. అతడు కారుతో వేగంగా వెళ్తున్న సమయంలో దొంగిలించిన కారు వెనుక సీటులో ఓ చిన్న పిల్లాడు కనిపించాడు. కారు కదలడంతో నిద్రలో ఉన్న చిన్నారి నిద్ర లేచింది. దాంతో ఆ దొంగకు షాక్ తగిలినంత పనైంది..కార్ ఓనర్ ఆగి ఉన్న కారులో చిన్నారిని వదిలేసి వెళ్లిన్నట్టుగా భావించిన ఆ దొంగ తిరిగి వచ్చి చిన్నారిని తల్లికి అప్పగించాడు.. కథ ఇక్కడితో ముగియలేదు.. ఇక్కడే ఆ దొంగ మరో ట్విస్ట్ ఇచ్చాడు.
ఈ ఘటన అమెరికాలోని బీవర్టన్‌లో చోటుచేసుకుంది. 2021లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు Unknown Facts Insta అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సినిమా కంటే తక్కువేమీ కాదు., ఎందుకంటే అడుగడుగునా ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఒరెగాన్‌లోని బీవర్టన్ సమీపంలోని షాపింగ్ మార్కెట్‌లోకి ఓ మహిళ వెళ్లింది. తర్వాత కారు పార్క్ చేసి షాపింగ్‌కు వెళ్లింది. అయితే ఆమె కారు వెనుక సీటులో చిన్నారిని నిద్రపోతుండగా అలాగే వదిలేసింది. కొన్ని వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వచ్చేస్తాననే ఉద్దేశంతో ఆమె ఈ పని చేసింది. కానీ, షాపింగ్‌కి కొంచెం ఎక్కువ సమయం పట్టింది.
ఇలోగా, కారు అద్దాన్ని పగులగొట్టి కొద్ది క్షణాల్లోనే కారును దొంగిలించాడు ఓ దొంగ. అనంతరం కారును వేగంగా నడుపుతూ అక్కడి నుంచి పరారయ్యాడు. కారు అతివేగంతో వెళ్లడంతో వెనుక సీటుపై నిద్రిస్తున్న చిన్నారికి మెలకువ వచ్చింది. చిన్నారి ఏడుపు విన్న దొంగ ఆశ్చర్యపోయాడు. ఆమె ఎలాంటి తల్లి అని అనుకుంటూ కోపం తెచ్చుకున్నాడు. అప్పటికి దొంగ కొంత దూరం వెళ్ళిపోయాడు. కానీ, చిన్నారి ఏడుపు విన్న ఆ దొంగ వెంటనే కారును యూ టర్న్ చేసి వెనక్కి వచ్చాడు. దొంగ కారు పార్కింగ్ ప్లేస్‌కు తిరిగి వచ్చినా.. తన బిడ్డను కారులో వదిలి వెళ్లిన తల్లి షాపింగ్ పూర్తి చేయలేదు. కొంతదూరంలో దొంగ కారు ఆపాడు. తర్వాత చిన్నారిని తన ఒడిలో పెట్టుకుని కార్ పార్కింగ్ ప్లేస్‌కి వచ్చాడు. కొంత సేపు ఆ మహిళ కోసం ఎదురుచూశారు. అప్పటికి గానీ, ఆమె తిరిగి వచ్చింది. కానీ, అక్కడ తన కారు కనిపించలేదు..దాంతో ఆమె భయపడిపోయింది. చుట్టూ చూడటం మొదలుపెట్టింది. దాంతో సదరు మహిళే ఆ కారు యజమాని అని దొంగ గుర్తించాడు. వెంటనే తన చేతిలో ఉన్న పిల్లవాడిని తల్లికి తిరిగి ఇచ్చాడు. బిడ్డ లభించిన ఆనందంతో ఆ మహిళ బిడ్డను కౌగిలించుకుని ఏడవడం ప్రారంభించింది.
ఇదిలా ఉండగా, ఆ దొంగ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిల్లాడిని ఇలా కారులో వదిలేస్తే ఎలా అంటూ మండిపడ్డాడు. మీరంతా మనుషులేనా అని ప్రశ్నించాడు. కారు అద్దాలు మూసేశారు. ఇంకేమైనా ఉండి ఉంటే ఆ చిన్నారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేదని అన్నాడు. పిల్లల్ని వెంటపెట్టుకుని షాపింగ్ చేయలేరా అంటూ ప్రశ్నించాడు. దొంగ మాటలు విన్న ఆ మహిళకు ఏం చెప్పాలో తోచలేదు. ఒక్కక్షణం భయంగా అక్కడే నిలబడిపోయింది. ఆ వెంటనే సదరు దొంగ ఆమెకు మరో ట్విస్ట్ ఇచ్చాడు..వారికి కొంత దూరంలో ఆగి ఉన్న కారు దగ్గరకు వెళ్లాడు. వెంటనే మళ్లీ కారు స్టార్ట్ చేసి అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. కారు చోరీకి గురైందని తెలుసుకుంది. కానీ, ఈ విషయమై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..