Video Viral: చనిపోతాడని వదిలేశారు.. ప్రాణాలకు తెగించి కాపాడిన టెకీ!
కొన్ని ఘటనలు చూస్తే మనిషిలో మానవత్వం ఇంకా మిగిలే ఉందని తెలిసి ఆశ్చర్యపోతాం. ఎత్తైన మంచు పర్వతంపై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పర్వతారోహకుడిని చూసి ఓ టెక్ వ్యాపారి చలించిపోయాడు. అతడిని కాపాడాలని తన గైడ్‌ను సాయం కోరాడు. కానీ ఆ గైడ్ అసాధ్యమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినా అతడు వెనక్కి తగ్గలేదు. ప్రాణాలకు తెగించి ఒంటరిగానే ఆ వ్యక్తిని కాపాడేందుకు రంగంలోకి దిగాడు.

కొన్ని ఘటనలు చూస్తే మనిషిలో మానవత్వం ఇంకా మిగిలే ఉందని తెలిసి ఆశ్చర్యపోతాం. ఎత్తైన మంచు పర్వతంపై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పర్వతారోహకుడిని చూసి ఓ టెక్ వ్యాపారి చలించిపోయాడు. అతడిని కాపాడాలని తన గైడ్‌ను సాయం కోరాడు. కానీ ఆ గైడ్ అసాధ్యమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినా అతడు వెనక్కి తగ్గలేదు. ప్రాణాలకు తెగించి ఒంటరిగానే ఆ వ్యక్తిని కాపాడేందుకు రంగంలోకి దిగాడు. ఏకంగా 6,300 మీటర్ల ఎత్తులో గంటల తరబడి శ్రమించి అతడిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చాడు. సాహసోపేత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ పర్వతంపై ఏం జరిగింది?
6,300 మీటర్ల ఎత్తులో చావుబతుకుల మధ్య
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఫిలిప్ కోజెరా (Filip Kozera) సౌనా ఏఐ (Sauna AI) అనే టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకుడు. కొన్నేళ్ల క్రితం గైడ్‌తో కలిసి కిర్గిజిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న లెనిన్ పీక్ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లాడు. 7,134 మీటర్ల ఎత్తున్న పర్వతాన్ని ఎక్కుతున్న సమయంలో 6,300 మీటర్ల ఎత్తులో మంచులో కూర్చుని నిద్రపోతున్న ఓ వ్యక్తిని కోజెరా గమనించాడు. అతడు తీవ్రంగా అలసిపోయి లేవలేని పరిస్థితిలో కనిపించాడు. చలికి తట్టుకోలేక అక్కడే నిద్రపోవడానికి సిద్ధమయ్యాడు. పర్వత ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ప్రాణాంతకమని కోజెరాకు తెలుసు. ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉండటం, తీవ్రమైన చలి, శారీరక అలసట కారణంగా పరిస్థితి వేగంగా విషమించవచ్చు. అలాంటి సమయంలో నిద్రపోవాలనే భావనకు లొంగిపోవడం ప్రమాదకరం.
సాయం చేయడానికి గైడ్ నిరాకరణ
మంచు మద్య కూర్చుండిపోయిన వ్యక్తిని చూసిన కోజెరా అతడిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గైడ్ దగ్గరకు వెళ్లి సాయం కోరాడు. అయితే, ఆ వ్యక్తిని అక్కడి నుంచి కిందకు తీసుకెళ్లడం అసాధ్యమని గైడ్ చెప్పాడు. అంతటితో ఆగకుండా అతడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. చుట్టూ మంచు, గడ్డకట్టే చలి.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తన ప్రాణాలకే ప్రమాదం. అయినప్పటికీ కోజెరా ఆ వ్యక్తిని అలా వదిలేసి వెళ్లలేకపోయాడు. సాయం చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. చివరకు తన ప్రాణాలకు ముప్పు ఉన్నా సరే అతడిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు.
ఒంటరిగానే పర్వతం నుంచి కిందకు..
కోజెరా ముందుగా ఆ వ్యక్తి భుజాన ఉన్న బ్యాగును తీసుకున్నాడు. అనంతరం అతడిని నెమ్మదిగా కిందకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. దారిలో ఆ వ్యక్తి మళ్లీ కిందపడిపోవడంతో అతడిని తిరిగి పైకి లేపి నిలబెట్టాడు. అతడి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు కదిలాడు. ఆ సమయంలో బయటకు ఎండ కనిపిస్తున్నప్పటికీ చలి మాత్రం తీవ్రంగా ఉంది. కొన్ని గంటల తర్వాత అతడిని 5,500 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌కు చేర్చగలిగాడు. అక్కడ రాత్రి గడిపిన అనంతరం మరుసటి రోజు ఆ వ్యక్తి కోజెరా బృందంతో కలిసి పర్వతం నుంచి కిందకు నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో అతడి ప్రాణాలు నిలిచాయి.
View this post on Instagram
‘ధైర్యం చూపే అవకాశం దేవుడే ఇస్తాడు’
ఈ ఘటన గురించి కోజెరా తన అనుభవాన్ని పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదాల్లో ఒకటి .. నిద్రపోవాలనే తీవ్రమైన కోరిక. కొన్నేళ్ల క్రితం 6,300 మీటర్ల ఎత్తులో మంచులో పడి ఉన్న వ్యక్తిని చూశాను. సాయంత్రం నాలుగు గంటల సమయానికి మేమే ఆ పర్వతంపై చివరిగా మిగిలిన వారం. అంతకు గంట క్రితమే ఆ వ్యక్తి ఇబ్బంది పడటం చూశాను. అతడి పరిస్థితి చూస్తే బతికే అవకాశం లేదనిపించింది’ అని రాసుకొచ్చాడు. గైడ్ కూడా సాయం చేయడానికి నిరాకరించడంతో ఏం చేయాలో తనే నిర్ణయించాల్సి వచ్చిందని తెలిపాడు. ‘నేను మత విశ్వాసాలను పెద్దగా నమ్మను. చిన్నప్పుడు ఓ మత గురువు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. దేవుడు ధైర్యాన్ని నేరుగా ఇవ్వడు.. దాన్ని నిరూపించుకునే అవకాశాన్ని ఇస్తాడు. ఆ రోజు నాకు అలాంటి అవకాశమే వచ్చింది’ అని కోజెరా వివరించాడు.
వీడియో వైరల్.. ప్రశంసల వర్షం!
ఈ సాహసోపేత వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నెటిజన్లు కోజెరా ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. ‘మీరు అతడిని వదిలేసి వెళ్లి ఉంటే, మరుసటి రోజు అతడు చనిపోయాడని తెలిసినప్పుడు ఎంత బాధపడేవారో ఒక్కసారి ఆలోచించండి. మనం జీవితాంతం పశ్చాత్తాపపడకుండా ఉండే నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ ఓ నెటిజన్ స్పందించాడు. పర్వతారోహణలో తమ ప్రాణాలను కాపాడుకోవడమే పెద్ద సవాలు. అలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తి ప్రాణాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కోజెరా.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.