Viral news: జీవితం ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఇది అక్షరసత్యం. అవసరం ఎంతటి పని అయినా చేయిస్తుంది. సాధారణంగా ఏదైనా ఆవిష్కరణలు చేయాలంటే దానికో చదువు.. పరిశోధనలు అవసరం. కాని కొన్ని సందర్భాల్లో అవేమి లేకపోయినా మన చుట్టూ ఉండే పరిస్థితులే మనల్ని ఆపని చేసేలా ప్రోత్సహిస్తాయి. ఇలా వచ్చిన ఎన్నో ఆవిష్కరణలు నేటి ఆధునిక సమాజంలో మనం చూశాం. తాజాగా దివ్యాంగురాలైన తన కుమార్తె కోసం ఓ కూలీ సైంటిస్టుగా మారి తయారుచేసిన రోబో వైరల్ అవుతోంది. అంతేకాదు ప్రజలందరి ప్రశంసలు అందుకుంటోంది. పరిస్థితులే అతన్ని పరిశోధనకుడిని చేశాయి. దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న 40 ఏళ్ల బిపిన్ కదమ్‌కు దివ్యాంగురాలైన తన కుమార్తె కోసం అవిష్కర్తగా మారాడు. తన కుమార్తెకు నిత్యం భోజనం కలిపి తినిపించేందుకు రోబోనే తయారు చేసి.. దానికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు.. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న 40 ఏళ్ల బిపిన్ కదమ్ తన కుమార్తెకు నిత్యం భోజనం కలిపి తినిపించడం సమస్యగా మారింది. తాను కష్టం చేస్తే గాని కుటుంబం గడవదు. దీంతో రోజూ పనికి వెళ్లాల్సిన పరిస్థితి. రెండేళ్ల క్రితం వరకు కుమార్తెకు భోజనం తినిపించే బాధ్యత బిపిన్ కదమ్ భార్య చూసుకునేది. భార్య కూడా అనారోగ్యంతో మంచాన పడడంతో కుమార్తెకు భోజనం తినిపించడం పెద్ద సమస్యగానే మారింది. తాను పనికి వెళ్తే కుమార్తె భోజనం తినడానికి ఇబ్బంది పడుతుంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం చూశాడు.
ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిన బాధ్యత కదమ్ పై పడింది. ఓ రోబో లాంటి పరికరాన్ని రూపొందిస్తే అదే తన కుమార్తెకు భోజనం పెట్టేందుకు సహకరిస్తుందని భావించాడు. అయితే దక్షిణ గోవాలోని పొండా తాలూకా బొతోరా గ్రామానికి చెందిన కదమ్ కు సాంకేతిక పరిజ్ఞానం పై ఎలాంటి అవగాహనా లేకపోయినా, కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యకు టెక్నాలజీనే పరిష్కారం చూపుతుందనే నమ్మకంతో ఆ దిశగా ప్రయత్నించాడు. ఏడాదిగా ఓ రోబో పరికరం కోసం వెతుకులాట ప్రారంభించాడు ఎక్కడా లభించకపోవడంతో తనకు తానే అలాంటి ఓ రోబోను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టాడు.
నిత్యం 12 గంటల పాటు ఇతర పనులు చేసుకొని మిగిలిన సమయంలో సాఫ్ట్ వేర్ పై అవగాహన పెంచుకున్నాడు. నాలుగు నెలల పాటు శ్రమించి ఒక రోబోను తయారుచేసి దానికి ‘మా రోబో’ అని నామకరణం చేశాడు. పూర్తి వాయిస్ కమాండ్ కంట్రోల్ ఆధారంగా ఈ రోబో పనిచేస్తుంది. రోబో చేతిలో ఉండే పళ్లెంలో ఆహారం పెడితే అది అమ్మాయికి తినిపిస్తుంది. వాయిస్ కమాండ్ ను ఉపయోగించి ఆహారాన్ని కూరతో లేదా పప్పుతో ఇలా అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల్లో దేనితో ఆ అమ్మాయి తినాలనుకుంటుందో వాయిస్ కమాండ్ ద్వారా తెలియజేస్తే ఆ రోబో ఆ విధంగానే పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఈ ఆవిష్కరణను ప్రశంసించింది. ఈ పరికరాన్ని వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది.
ఇంజినీరింగ్ చదువులు చదవకపోయినా ఎంతో మందికి ఉపయోగపడే పరికరాన్ని ఆవిష్కరించిన బిపిన్ కదమ్ ను మెచ్చుకోవల్సిందే.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..