AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

El nino: టోక్యోలో 35 రోజులు రికార్డు వర్షాలు.. చిలీ ఎడారిలో పూల వసంతం!

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు జపాన్ రాజధాని టోక్యోలో ఏకంగా 35 రోజుల పాటు వరుసగా వర్షాలు కురిసి రికార్డు సృష్టించగా.. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటైన చిలీలోని అటకామా ఎడారి రంగురంగుల పూలతో కనువిందు చేస్తోంది. ఈ రెండు భిన్నమైన పరిణామాల వెనుక ఎల్‌నినో ప్రభావం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

El nino: టోక్యోలో 35 రోజులు రికార్డు వర్షాలు.. చిలీ ఎడారిలో పూల వసంతం!
From Record Rain In Tokyo To Chile Desert Flowers Bloom El Nino At Work
Sharada V
|

Updated on: Oct 12, 2026 | 8:32 PM

Share

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ఎల్‌నినో అనే పదం స్పానిష్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం ‘చిన్న బాలుడు’. దక్షిణ అమెరికా తీరంలో చేపలు పట్టే మత్స్యకారులు 1600వ దశకంలో సముద్రం వేడెక్కడం వల్ల చేపల వేటపై ప్రభావం పడటాన్ని, భారీ వర్షాలు, తుపానుల వంటి పరిణామాలు చోటుచేసుకోవడాన్ని గమనించారు. ఈ మార్పులు సాధారణంగా క్రిస్మస్ సమయంలో కనిపించడంతో దీనికి ఎల్‌నినో అనే పేరు వాడుకలోకి వచ్చింది.

చిలీ ఎడారిలో ఎక్కడ చూసినా రంగురంగుల పూలు!

ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటైన చిలీలోని అటకామా ఎడారి ఇప్పుడు అరుదైన ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. సాధారణంగా బీడు భూములు, ఇసుక ప్రాంతాలతో కనిపించే ఈ ఎడారిలో.. భారీ వర్షాల తర్వాత పూలు వికసించాయి. సుమారు 200 రకాల పూలు పూయడంతో  ఎడారిలోని ప్రాంతాలు ఊదా రంగు పూలతో నిండిపోయాయి. ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా వర్షాభావంతో కనిపించే ఎడారిలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం వల్ల నేలలో నిద్రాణంగా ఉన్న విత్తనాలు మొలకెత్తి పూలు పూశాయి. ప్రకృతిలో వాతావరణ మార్పులు ఎలాంటి అద్భుతమైన దృశ్యాలను సృష్టించగలవో ఈ పరిణామం కనువిందు చేసింది.

Chile Desert Flowers Bloom El Nino At Work

Chile Desert Flowers Bloom El Nino At Work

టోక్యోలో 35 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు!

చిలీలోని ఎడారి పూలతో కళకళలాడుతుంటే.. జపాన్ రాజధాని టోక్యోలో  వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి.  వరుసగా 35 రోజుల పాటు వర్షాలు కురిసాయి.  టోక్యోలో సాధారణంగా నమోదయ్యే వర్షపాతం కంటే మూడు రెట్లు ఎక్కువ వర్షం కురిసింది. అదే సమయంలో ఏకంగా 14 రోజుల పాటు సూర్యుడు కనిపించలేదు. దీంతో నగరవాసులు ఎప్పుడు ఎండ వస్తుందా అని ఎదురుచూసారు. నిరంతర వర్షాల కారణంగా పర్యాటక రంగంపై ప్రభావం పడటంతో పాటు కూరగాయల ధరలు పెరిగాయి. టోక్యోలో గతంలో  33 రోజులు వర్షాలు నమోదయ్యాయి. 2019 జూన్ 27 నుంచి జూలై 29 వరకు ఈ పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు 35 రోజుల వర్షాలు ఆ రికార్డును అధిగమించింది.

ఎల్‌నినో మరింత బలపడుతుందా?

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం.. 2026 చివరి నెలల్లో పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎల్‌నినో మరింత బలపడవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చు. 1950 తర్వాత నమోదైన బలమైన ఎల్‌నినో ఘటనల్లో ఇది ఒకటి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల కరువు పరిస్థితులు, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ముప్పు పెరగవచ్చు.

ప్రపంచ వాతావరణంపై ఎలాంటి ప్రభావం?

ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం, పర్యాటకం, నీటి లభ్యత, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో వరదలు, నేల కోత వంటి సమస్యలు తలెత్తవచ్చు. వర్షాలు తగ్గే ప్రాంతాల్లో నీటి కొరత, పంటల దిగుబడి తగ్గడం వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయితే, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావం ఒకేలా ఉండదు. స్థానిక వాతావరణ పరిస్థితులు, ఇతర సముద్ర సంబంధిత మార్పులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

Follow Us