చీమల దండు ఐకమత్యానికి ప్రతీక. చీమల దండుపై ఇప్పటి వరకు జరిగిన పలు అధ్యయనాల్లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తాజాగా మరో అధ్యయనంలోనూ వరదల నుంచి తప్పించుకునేందుకు చీమల దండు అనుసరిస్తున్న ఐడియా పరిశోధకులనే ఫిదా చేస్తోంది. వరదల్లో కొట్టుకుపోకుండా చీమల దండు ఐకమత్యంతో తప్పించుకుంటున్నాయి. వరదలొచ్చినప్పుడు పైర్ ఆంట్స్(ఎర్ర, నల్ల గండు చీమలు) ప్రవర్తనపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వరదల్లో చిక్కుకున్నచీమలు ఒకదానికొకటి అల్లుకుని తెప్పలాగా ఏర్పడుతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ తెప్ప వంటి నిర్మాణం తరచుగా మార్చుతూ నీటి ప్రవాహంపై చీమల దండు తేలుతోంది. ఈ ప్రక్రియను త్రెడ్ మిల్లింగ్’ గా పరిశోధకులు పేర్కొంటున్నారు.
చీమల శరీరంలోని ప్రత్యేకత ఏంటంటే అది నీటిని అంటుకోని నిర్మాణం కలిగి వుండటం. అలాగే చీమ శరీరం బెలూన్‌లా పనిచేసి నీటిపై తేలే విధంగా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. చీమల్లో రాణి చీమ, కూలి చీమలుంటాయి. మూడు వేల నుంచి పది వేల కూలీ చీమలను కంటెయినర్లో ఉంచి పరిశోధన జరిపారు. నీటి ప్రవాహం పెరిగేకొద్దీ ఒకదాని కాళ్లను మరొకటి పట్టుకొని కన్వేయర్ బెల్ట్‌లా చీమల దండు ఏర్పడింది. చీమల తెప్ప నిర్మాణం పొరవలే ఉండి ఇతర చీమలు ఒక పక్క నుంచి ఇంకోపక్కకు వెళ్లేందుకు వీలుకల్పిస్తున్నాయి. నిరంతరం అమరికలను మారుస్తూ నీటి ప్రవాహం నుంచి చీమలు రక్షణ పొందాయి. చీమల ప్రవర్తనపై పరిశోధకులు చేసిన అధ్యయన వివరాలు ద రాయల్ సొసైటీ ఆఫ్ పబ్లిషింగ్ జర్నల్ లో ప్రచురితమైంది.
Also Read..
2 నిమిషాల్లో 8 సార్లు రంగులు మార్చిన ఊసరవెల్లి..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..